
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.
ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.
మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.