
సాక్షి, అనంతపురం: హైకోర్టు ఆదేశాలను ఏపీ పోలీసులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అలాగే, తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు.. తనను అడ్డుకోవడం పట్ల కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యకం చేశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘నేను తాడిపత్రి వెళితే భద్రత కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో ప్రధాన మంత్రి పర్యటన ఉందని.. భద్రత కల్పించలేమని ఎస్పీ జగదీష్ వివరణ ఇస్తున్నారు. ఇప్పటికే ఏడెనిమిది సార్లు నేను తాడిపత్రి పర్యటన వాయిదా వేసుకున్నా. నాకు తాడిపత్రిలో సొంత ఇళ్లు ఉంది.. నా ఇంటికి నేను వెళ్తానంటుంటే పోలీసులు అడ్డుపడుతున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారు. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారు
నేను తాడిపత్రి వస్తానని తెలిసిన ప్రతిసారీ.. రౌడీలు, గూండాలు ఉన్న ప్రైవేటు సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. తాడిపత్రిలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. తాడిపత్రిలో ఐపీఎస్ అధికారి విధులు నిర్వహిస్తున్నా ఏం ప్రయోజనం లేదు. విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. నేను తాడిపత్రి వెళితే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని జేసీ భయపడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
