ఆ జీవో చెల్లదు

Supreme Court On Narayana Medical College Case - Sakshi

టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సులు లేకుండా ఫీజులు పెంచకూడదు

అదనంగా వసూలు చేసిన ఫీజులు విద్యార్థులకు తిరిగివ్వాలని ఆదేశం

నారాయణ మెడికల్‌ కాలేజీ కేసులో స్పష్టీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ) సిఫార్సులు లేకుండానే సూపర్‌ స్పెషాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ టీడీపీ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్ధించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ నారాయణ మెడికల్‌ కాలేజి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతోకూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది.

ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం, నారాయణ మెడికల్‌ కాలేజి చెరో రూ.2.5 లక్షలు ఆరు వారాల్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జమ చేయాలని, ఆ మొత్తాన్ని నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా), సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్‌ ప్రాజెక్టు కమిటీలకు బదిలీ చేయాలని తీర్పులో పేర్కొంది.

జరిగిందిదీ..
ఏఎఫ్‌ఆర్సీ 2011లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సీట్ల రుసుములు నిర్ణయించింది. మూడేళ్లకోసారి ఈ ఫీజులు సవరిస్తూ ఉంటుంది. 2017 వచ్చినప్పటికీ ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సులు చేయలేదు. ఏఎఫ్‌ఆర్సీ తగిన సమయంలో సిఫార్సులు చేయకపోవడంతో 2017 జూన్‌ 9న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఫీజులు పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ జీవోను కొంతమంది విద్యార్థులు హైకోర్టులో సవాల్‌ చేశారు. హైకోర్టు 2019లో జీవో చెల్లదని ఆదేశాలు ఇచ్చింది. ఏఎఫ్‌ఆర్సీ సిఫార్సుల మేరకే ప్రభుత్వం జీవో ఇవ్వాలని స్పష్టం చేసింది. దీన్ని నారాయణ మెడికల్‌ కాలేజ్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top