అనుమతి లేకుండా కరోనా చికిత్స చేస్తే కఠిన చర్యలు

Strict measures if corona treatment without permission - Sakshi

కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌ వినియోగం పెరిగింది

తాజాగా 55,719 పడకలు అందుబాటులోకి 27,576 ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉంచాం

వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనా సరే అనుమతి లేకుండా కరోనా వైద్యసేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌సింఘాల్‌ చెప్పారు. ఆయన ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అనుమతి లేకుండా వైద్యం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై నిఘా పెంచామని చెప్పారు. అలా జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్‌ మొదలు మందుల వరకు కొనుగోలుకు సీనియర్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 558 ఆస్పత్రుల్లో 55,719 పడకలను అందుబాటులో ఉంచామన్నారు. గుంటూరులో 869, కృష్ణాలో 684 ఐసీయూ బెడ్‌లు ఉన్నాయని, చాలా జిల్లాల్లో బెడ్‌లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో 27,576 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 18,299 మంది పేషెంట్లు ఉన్నారని చెప్పారు. 81 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 10,100 మందికి సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో 27,615 రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు ఉన్నట్లు చెప్పారు. 104 కాల్‌సెంటర్‌కు రోజురోజుకు కాల్స్‌ సంఖ్య పెరుగుతోందన్నారు. ఎక్కువ మంది కోవిడ్‌ టెస్టులకు, కోవిడ్‌ టెస్టు ఫలితాల కోసం, పడకల కోసం ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. గత ఏడాది 18 వేలమంది వైద్య సిబ్బందిని నియమించగా, ఈ ఏడాది ఇప్పటివరకు 16,019 మందిని నియమించినట్లు చెప్పారు మరో మూడువేల పోస్టులను భర్తీచేస్తామన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్‌ వినియోగం పెరుగుతోందని, అవసరాల మేరకు ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. ఎక్కడా పడకల కొరత లేదని, రెమ్‌డెసివిర్‌ తగినన్ని ఇస్తున్నామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులకు రెమ్‌డెసివిర్, ఆక్సిజన్‌ ప్రభుత్వం సరఫరా చేయడం కష్టతరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top