పోస్టల్‌ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌తో 3.03 లక్షల మంది ఓటు

Published Wed, May 8 2024 4:51 AM

Strict action will be taken against employees who are tempted

ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం 

వీవీఐపీల బందోబస్తుకు హాజరయ్యే పోలీసులకు 9న పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా వెల్లడి  

సాక్షి, అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో మంగళవారం నాటికి 3.03 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కొన్ని జిల్లాల్లో 3వ తేదీన, మరికొన్ని జిల్లాల్లో 4వ తేదీన హోమ్‌ ఓటింగ్, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రారంభమయ్యాయి.

ఇప్పటివరకు పోస్టల్‌ బ్యాలెట్‌కు 4.30 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 3.20 లక్షల మంది ఉద్యోగులు, 40 వేల మంది పోలీసులు, హోమ్‌ ఓటింగ్‌ కేటగిరీ కింద 28 వేల మంది, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కింద 31 వేల మంది ఉన్నారు. మిగిలిన వారిలో సెక్టార్‌ ఆఫీసర్లు, ఇతరులున్నారు. ఇప్పటివరకు 2.76 లక్షల మంది ఉద్యోగులు, దాదాపు 28 వేల మంది హోమ్‌ ఓటింగ్, ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ కేటగిరీల వారు ఓట్లు వేశారు. 

కొందరు ఉద్యోగులు పలు రకాల కారణాల వల్ల పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేకపోయారు. వారికి ఏ ఆర్వో పరిధిలో ఓటు ఉంటే.. ఆ ఫెసిలిటేషన్‌ కేంద్రంలోనే స్పాట్‌లో ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేలా మంగళ, బుధవారాల్లో అవకాశాన్ని కల్పించాం. ఈ విషయంపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేశాం. కానీ ఈరోజు కూడా కొన్ని సమస్యలు తలెత్తాయని మా దృష్టికి వచ్చింది’ అని చెప్పారు.

ప్రలోభాలకు గురైతే కఠిన చర్యలు
పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్‌ చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ ఉద్యోగులు కొందరు నగదు తీసుకొని ఓటు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది చెడు సంకేతం. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డబ్బులు పంచుతున్న నలుగురిని అరెస్టు చేశాం. అనంతపురంలో ఒక కానిస్టేబుల్‌ ఉద్యోగుల జాబితా పట్టుకుని నగదు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించాం. అతన్ని వెంటనే సస్పెండ్‌ చేశాం.

విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫెసిలిటేషన్‌ సెంటర్‌ వద్ద ఇద్దరి నుంచి నగదు సీజ్‌ చేసి అరెస్టు చేశాం. ఒంగోలులో యూపీఐ విధానం ద్వారా కొందరు ఉద్యోగులకు నగదు పంపించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. కాల్‌ డేటా, బ్యాంక్‌ లావాదేవీల ఆధారంగా దాదాపు 8, 10 మంది ఉద్యోగులను గుర్తించాం’ అని ముఖేష్‌కుమార్‌ మీనా చెప్పారు. కాగా, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పలువురు వీవీఐపీలు పర్యటిస్తున్న నేపథ్యంలో బందోబస్తులో ఉండే పోలీసులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు.

 బందోబస్తులో పాల్గొనే పోలీసులు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఇంకా ఎవరైనా పోలీసులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోకపోతే.. ఈ నెల 9న వారికి అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేశాం’ అని చెప్పారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement