
బ్యాలెట్టే బెస్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
2026 మధ్యంతర ఎన్నికల్లోపే ఆ విధానాలకు స్వస్తి పలుకుతా
ఆ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా
బ్యాలెట్ పేపరే అత్యంత అనువైనది, భద్రమైనది.. వాటితో ఎలాంటి అనుమానాలకు తావు ఉండదు
వాషింగ్టన్: సంచలనాల తేనెతుట్టెను తరచూ కదుపుతూ వివాదాలను రాజేసే అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త అంశంతో తెరమీదకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలాగైనా ఆపుతానని అంతర్జాతీయ అంశాన్ని ఎత్తుకున్న ట్రంప్ హఠాత్తుగా దేశీయ రాజకీయ అంశంపై ప్రధానంగా దృష్టిసారించారు. పోస్టల్ ఓటింగ్(మెయిల్ ఇన్ బ్యాలెట్) విధానం పూర్తి లోపభూయిష్టంగా తయారైందని, పోస్టల్ ఓటింగ్ కారణంగా భారీ స్థాయిలో మోసం జరుగుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
‘‘అత్యంత వివాదాలకు కేంద్రస్థానంగా నిలుస్తున్న ఓటింగ్ మెషీన్లను మూలకు పడేస్తా. 2026లో వచ్చే మధ్యంతర ఎన్నికలలోపే మెయిల్–ఇన్–బ్యాలెట్, ఓటింగ్ మెషీన్లకు చరమగీతం పాడుతూ త్వరలోనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేస్తా’’ అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ మెయిల్–ఇన్ బ్యాలెట్ విధానానికి ముగింపు పలికే ఉద్యమానికి సారథ్యంవహిస్తా. కచ్చితత్వం లోపించిన, అత్యంత ఖరీదైన, వివాదాస్పదమైన ఓటింగ్ మెషీన్లను త్యజిద్దాం.
అత్యంత అనువైన, భద్రమైన, సులభతరమైన బ్యాలెట్ (వాటర్‌మార్క్) పేపర్‌తో పోలిస్తే ఓటింగ్ మెషీన్ అనేది పదిరెట్లు ఎక్కువ వ్యయంతో కూడిన వ్యవహారం. బ్యాలెట్ పేపర్‌తో చాలా వేగంగా ఎన్నికలు నిర్వహించవచ్చు. ఎలాంటి అనుమానాలకు తావుండదు. ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో ఇట్టే తెలిసిపోతుంది. మెయిల్–ఇన్–ఓటింగ్‌ను అనుసరిస్తున్న ఏకైక దేశం మనదే.
భారీస్థాయిలో ఓట్ల అవకతవకలు వెలుగుచూడడంతో దాదాపు అన్ని దేశాలు ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లకు మంగళంపాడాయి. ఇకనైనా తప్పులను సరిదిద్దుకుందాం. తప్పుల సవరణను డెమొక్రాట్లు పూర్తిగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వాళ్లు ఈ తప్పులను గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో చేశారు. 2026 మధ్యంతర ఎన్నికలకు మరింత విశ్వసనీయతను ఆపాదించేందుకు సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై త్వరలో సంతకం చేస్తా’’ అని అన్నారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజికమాధ్యమ ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
రాష్ట్రాలది కేవలం ఏజెంట్ పాత్ర
‘‘ ఎన్నికల్లో రాష్ట్రాల పాత్ర నామామాత్రం. ఫెడరల్ ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను టేబుల్‌పై ఉంచడం, లెక్కించడం వంటివి చేసే ఏజెంట్ పాత్ర మాత్రమే పోషించాలి. అమెరికా అధ్యక్షుడి ఆదేశానుసారం ఫెడరల్ ప్రభుత్వం సూచించే సూచనలను రాష్ట్రాలు తూ.చ. తప్పకుండా పాటిస్తే సరిపోతుంది. అలా ఉంటేనే దేశానికి మంచిది. అంతేగానీ విప్లవ భావజాల విపక్ష పార్టీలు సరిహద్దులు తెరవాలని డిమాండ్లు చేయడం, మహిళా క్రీడల్లో ట్రాన్స్‌జెండర్ల మాటున పురుషులూ పాల్గొనేలా చేయడం వంటివి ప్రోత్సహించకూడదు. అసలు ఈ లోపభూయిష్ట మెయిల్–ఇన్ కుంభకోణం జరక్కపోతే డెమొక్రాట్లు గతంలో గద్దెనెక్కేవాళ్లే కాదు.
మెయిన్–ఇన్ బ్యాలెట్/ఓటింగ్‌తో ఎన్నికలు ఎప్పటికీ విశ్వసనీయంగా జరగబోవు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా డెమొక్రాట్లకు బాగా తెలుసు. అమెరికా ఎన్నికల ప్రక్రియకు విశ్వసనీయత, సమగ్రత తెచ్చేందుకు రిపబ్లికన్ పార్టీ నేతలతో కలిసి నేను ఎంతకైనా తెగించి పోరాడతా. మెయిల్–ఇన్ బ్యాలెట్ అనేది పూర్తి మోసపూరిత ప్రక్రియ. ఇక ఓటింగ్ మెషీన్లను ఉపయోగించడం అనేది మొత్తంగా ఎన్నికల ప్రక్రియను వినాశనం చేయడమే. ఇక వీటికి ఖచ్చితంగా ముగింపు పలకాల్సిందే. పారదర్శకంగా, నిజాయతీగా ఎన్నికలు నిర్వహించుకోకుంటే బలమైన, దుర్బేధ్యమైన సరిహద్దులేకుంటే మనకంటూ ఒక దేశం కూడా మిగలదు’’ అని ట్రంప్ అమెరికన్ ఓటర్లనుద్దేశించి అన్నారు.