నాలుగేళ్లలో ఎంఎస్‌ఎంఈల రైజింగ్‌ లక్ష్యంగా ముందడుగు

A step forward aimed at the rising of MSMEs in four years - Sakshi

వరల్డ్‌ బ్యాంక్‌ సహకారంతో రాష్ట్రంలో ర్యాంప్‌ ప్రోగ్రాం

2026–27 వరకు అమల్లో ర్యాంప్‌ ప్రోగ్రాం 

త్వరలో కేంద్రానికి స్ట్రాటజిక్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రాం 

దీనిని పరిశీలించి నిధులివ్వనున్న కేంద్రం 

అత్యధిక నిధులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక 

ఇందులో భాగంగా ఎంఎస్‌ఎంఈల సమస్యల గుర్తింపు 

నెలాఖరులోగా అన్ని జిల్లాల ఎంఎస్‌ఎంఈలతో సమావేశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈలకు) పూర్తి­స్థాయి­లో సహాయ సహకారాలు అందిస్తోంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమ­యంలోనూ వాటికి చేయూతనిచ్చి, తిరిగి జీవం పోసుకొనేలా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

ఇందుకోసం వరల్డ్‌ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైజింగ్‌ అండ్‌ యాక్సలరేటింగ్‌ ఎంఎస్‌ఎంఈ పెర్‌ఫార్మెన్స్‌ (ర్యాంప్‌ ప్రోగ్రాం)ను పూర్తి­స్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈలకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అదుబాటులోకి తేవడం, మార్కెటింగ్, రుణ సదుపాయం, ఎగుమతుల అవకాశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చెల్లింపుల్లో జాప్యం నివారించడం, ఎంఎస్‌ఎంఈల్లో స్త్రీల భాగస్వామ్యం పెంచడం వంటివి ఈ ర్యాంప్‌ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం.

కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునే ఉద్దేశంతో 2022–23 నుంచి 2026–27 కాలానికి రూ.6,062.45 కోట్లతో ర్యాంప్‌ ప్రోగ్రాంని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఇందులో రూ. 3,750 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా ఇస్తుంది. మిగిలిన రూ.2,312.45 కోట్లు కేంద్రం సమకూరుస్తుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఒక స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌­మెంట్‌ ప్రోగ్రాంను (సిప్‌) రూపొందించాలి. దీనిని కేంద్రం పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాత నిధులు మంజూరు చేస్తుంది.

ఇందులో అత్యధిక నిధులను పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన­కార్యదర్శి చైర్మన్‌గా ఆరుగురు సభ్యులతో స్టేట్‌ ర్యాంప్‌ ప్రోగ్రాం కమి­టీని ఏర్పాటు చేసింది. ర్యాంప్‌ నోడల్‌ ఏజెన్సీగా ఏపీఎంఎస్‌ఎంఈ డెవలప్‌­మెంట్‌ కార్పొరేషన్, నోడల్‌ అధికారిగా పరిశ్రమల శాఖ కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

సమస్యల పరిష్కారానికి ప్రాంతీయ సదస్సులు
రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల సమస్యలను తెలుసు­కొని వాటికి చక్కటి పరిష్కార మార్గాలను సూచిస్తూ స్ట్రాటజిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రోగ్రాంను జూన్‌ 15లోగా కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ రాష్ట్రవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వ­హి­స్తోంది. ర్యాంప్‌ కార్యక్రమంపై అధికారు­లకు అవగాహన కల్పించడం కోసం తాజాగా పరిశ్ర­మల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధ్యక్షతన వర్క్‌షాప్‌ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌లో ఏటా అత్యధిక మొత్తం పొందేలా ప్రణాళి­కలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదే­శించారు. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈల సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెలాఖరులోగా 5 పట్టణాల్లో వర్క్‌షాపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ పట్టణానికి దగ్గరగా ఉండే జిల్లాలకు చెందిన ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు, అసోసియేషన్లు సమావేశంలో పాల్గొని వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తూ సిప్‌ను రూపొందిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top