నేటినుంచి రోజువారీ విచారణ  | Statement of AP High Court Tripartite Tribunal On AP Capital Related Lawsuits | Sakshi
Sakshi News home page

నేటినుంచి రోజువారీ విచారణ 

Oct 6 2020 3:22 AM | Updated on Oct 6 2020 4:06 AM

Statement of AP High Court Tripartite Tribunal On AP Capital Related Lawsuits - Sakshi

సాక్షి, అమరావతి: రాజధాని అంశానికి సంబంధించి పలు అభ్యర్థనలతో దాఖలైన అనుబంధ వ్యాజ్యాలపై మంగళవారం నుంచి రోజువారీ విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రాజ్‌భవన్, సచివాలయం, ఇతర శాఖాధిపతుల కార్యాలయాలు, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ విశాఖకు తరలించకుండా నిరోధించాలని, రాజధాని భూములను థర్డ్‌ పార్టీలకు కేటాయించరాదని, విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల కోసం ఖజానా నుంచి ఖర్చు చేయకుండా ఆదేశించాలని కోరుతూ అనుబంధ వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. తొలుత వీటిపై విచారణ జరిపి తరువాత ప్రధాన వ్యాజ్యాలపై తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. ఒకేవిధంగా ఉన్న అభ్యర్థనలను ప్రధాన వ్యాజ్యాలతో కలిపి విచారిస్తామని తెలిపింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి విచారించాల్సిన అనుబంధ వ్యాజ్యాలను ఇతర వ్యాజ్యాల నుంచి వేరు చేసింది. ఇలా వేరు చేసిన వాటిల్లో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యాజ్యాలు కూడా ఉన్నాయి.

రాజధాని తరలింపునకు సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తామని, ప్రధాన వ్యాజ్యాలను మాత్రం భౌతిక విచారణ ద్వారా విచారిస్తామని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని తరలింపు వ్యాజ్యాలకన్నా ముందు పేదలకు ఇళ్ల స్థలాల మంజూరుకు సంబంధించిన వ్యాజ్యాలను విచారించాలన్న అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. పేదల ఇళ్ల స్థలాల వ్యాజ్యాలపై త్వరగా విచారణ జరపాలని హైకోర్టును సుప్రీంకోర్టు కోరిందని ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. సుప్రీంకోర్టు చాలా చెబుతుందని, వాటన్నింటిపై తామేం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ముందు రాజధాని తరలింపు వ్యవహారాన్నే తేలుస్తామని తేల్చి చెప్పింది.

ఆ రెండు చోట్ల చిన్నవి..
రాజధాని అంశానికి సంబంధించి హైకోర్టులో దాదాపు 90కిపైగా వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా విశాఖలో అతిథి గృహం నిర్మాణంపై పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది నిదేష్‌ గుప్తా మరోమారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి, కాకినాడలో చాలా స్వల్ప విస్తీర్ణంలో అతిథి గృహాలను నిర్మిస్తున్న ప్రభుత్వం  విశాఖలో మాత్రం 30 ఎకరాల్లో కడుతోందని, కార్య నిర్వహణ రాజధానిని తరలించే చర్యల్లో భాగంగానే భారీ స్థాయిలో నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రపతి భవన్‌ సైతం ఐదు ఎకరాల్లో 340 గదులతో నిర్మితమైందన్నారు. ప్రభుత్వం కౌంటర్‌లో సందేహాలను నివృత్తి చేయలేదని, దీనికి తిరుగు సమాధానం ఇస్తామని చెప్పారు.

అతిథి గృహానికి తరలింపుతో సంబంధం లేదు...
అయితే ఈ వాదనలను ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తోసిపుచ్చారు. విశాఖలో పెద్ద అతిథి గృహం కడుతున్నారుకాబట్టి తిరుపతి, కాకినాడలో కూడా అంతే పెద్దది కట్టాలని కోరుతున్నారో లేక ఆ రెండు నగరాల్లో మాదిరిగా విశాఖలో చిన్నది నిర్మించాలని కోరుతున్నారో అర్థం కావడం లేదని ఏజీ పేర్కొన్నారు. పిటిషన్‌లో లేని రాష్ట్రపతి భవన్‌ గురించి, ఇతర విషయాల గురించి ప్రస్తావించడం సరి కాదన్నారు. విశాఖలో నిర్మించ తలపెట్టిన అతిథి గృహానికి, రాజధాని తరలింపునకు ఏమాత్రం సంబంధం లేదని ఏజీ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం చేసిన వ్యయాల వివరాలను అకౌంటెంట్‌ జనరల్‌ ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా తెప్పించుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

అన్ని వ్యాజ్యాలపై వీడియో కాన్ఫరెన్స్‌  విచారణ అసాధ్యం...
అతిథి గృహం నిర్మాణంపై స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇచ్చామని ధర్మాసనం గుర్తు చేసింది. రకరకాల అభ్యర్థనలతో అనుబంధ వ్యాజ్యాలతో కలిపి తమ ముందు 229 వ్యాజ్యాలు ఉన్నాయని తెలిపింది. ఇందులో 183 వ్యాజ్యాలు రాజధాని తరలింపుపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ వ్యాజ్యాలు కాగా, రెండు వ్యాజ్యాలు స్టే ఎత్తివేయాలని కోరుతూ దాఖలు చేసినవని, 44 ఇతర అంశాలకు సంబంధించినవని పేర్కొంది. అన్ని వ్యాజ్యాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ అసాధ్యమని ధర్మాసనం అభిప్రాయపడింది. అనుబంధ వ్యాజ్యాలపై తొలుత విచారణ నిర్వహిస్తామన్న ధర్మాసనం ప్రతిపాదనకు పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు, ప్రభుత్వం తరఫున ఏజీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. దీంతో ధర్మాసనం ఒక్కో కేసును పిలిచి ప్రాధాన్యతలను బట్టి వ్యాజ్యాలను వేరు చేసింది. ఈ వ్యాజ్యాలతో సంబంధం లేని వాటిని జాబితా నుంచి తొలగించింది.

కౌంటర్‌ దాఖలుకు గడువిచ్చేందుకు అంగీకారం..
రాజధాని ప్రాంతంలో గృహాల నిర్మాణాన్ని ప్రభుత్వం ఆపివేయటాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ వేశామని, ప్రభుత్వం ఇప్పటి వరకు కౌంటర్‌ దాఖలు చేయలేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్‌కుమార్‌ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు పేర్కొన్నారు. కౌంటర్‌ దాఖలుకు ఏజీ గడువు కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement