
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ రేపటి నుండి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం 12.20 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరనున్న ఎస్‌ఈసీ.. మధ్యాహ్నం 1.30గంటలకు విశాఖ చేరుకొని, అక్కడి నుంచి 2.30 గంటలకు శ్రీకాకుళం బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్ష అనంతరం, సాయంత్రం 7 గంటల నుంచి విజయనగరం జిల్లా అధికారులతో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
ఆ రాత్రికి విశాఖలోనే బస చేయనున్న ఎస్‌ఈసీ.. 2వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ జిల్లా అధికారులతో, మధ్యాహ్నం 1.30 గంటలకు కాకినాడ వెళ్లి తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి ఏలూరు చేరుకొని, రాత్రి 7 గంటల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుకుంటారు.