SRGMP Singer Parvathi: ఒక్క పాటతో కోట్ల మంది మదిని గెలిచింది.. మంత్రి పేర్ని నానితో మాట్లాడించి..

SRGMP Singer Parvathi Shares her Thoughts to Sakshi Media

మంచి గాయనిగా స్థిరపడాలన్నదే కోరిక  

కుటుంబ సహకారం మరువలేనిది 

గాయని లక్కసాగరం దాసరి లక్ష్మీపార్వతి

ఆ యువతి బస్సు సౌకర్యం లేని మారుమూల గ్రామంలో జన్మించింది. అయితేనేం.  ‘ఊరంత వెన్నెలా.. మనసంతా చీకటి’ పాటతో కోట్లాది మంది మదిని గెలిచింది. పుట్టిన ఊరికి పేరు ప్రతిష్టతో పాటు బస్సు సౌకర్యం తీసుకొచ్చింది దాసరి లక్ష్మీపార్వతి. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామానికి చెందిన ఈ యువ గాయని శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడింది. మనోగతం ఆమె మాటల్లోనే..  

saregamapa singer parvathy: మాది సాధారణ మధ్య తరగతి కుటుంబం. మా తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసులు, మీనాక్షమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూమార్తెలు సంతానం. అందరి కంటే మా కుటుంబంలో పెద్దది అక్క సరస్వతి, తర్వాత ఇద్దరు అన్నలు చంద్రమోహన్, ఉపేంద్ర. వారి తర్వాత నేను పుట్టాను. మాకున్న 4.70 ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే ఇష్టం. మా ఊరి ప్రాథమిక స్కూలులో చదివేటప్పుడు మొదటిసారిగా ‘పుట్టింటికిరా చెల్లి’ సినిమాలో పాట పాడాను. దీన్ని విన్న మా ఉపాధ్యాయుడు మద్దయ్య భవిష్యత్తులో మంచిస్థాయిలో ఉంటావని చెప్పి అభినందించారు.

తర్వాత 4,5 తరగతులను డోన్‌ మండలం జగదుర్తి గ్రామ సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో, 6 నుంచి 10 తరగతి వరకు కొత్తపల్లె మండలంలోని కస్తూరిబా బాలికల పాఠశాల, ఇంటర్‌ ఎమ్మిగనూరు ప్రభుత్వ కాలేజీలో చదివాను. నేను అక్కడ పాటలు పాడటాన్ని చూసి ఉపాధ్యాయులు ప్రోత్సహించేవారు. ఇంటర్‌ తర్వాత వ్యవసాయం కలిసిరాక కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో  ఏడాదిపాటు ఇంటి దగ్గరే ఉన్నా. ఈ సమయంలో మా అమ్మనానలు, అన్నలు పడుతున్న  కష్టాన్ని కళ్లారా చూసి వారితో పాటు నేను పొలం పనులకు వెళ్లాను.
 
తిరుపతి సంగీత కళాశాలలో శిక్షణ 
ఒకరోజు నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే  పలుకూరు గ్రామానికి చెందిన హర్మోనిస్టు హరి  విని  సంగీతం నేర్పిస్తే   మీ చెల్లెలు  మంచి గాయని అవుతుందని మా అన్నయ్యకు చెప్పారు.  అలా ఆయన ద్వారానే తిరుపతిలో సంగీత కళాశాల ఉందనే విషయం తెలుసుకుని  2017లో ఆ కళాశాలకు అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని చేరాను. అక్కడ గురువు వల్లూరి సురేష్‌బాబు వద్ద శిక్షణ తీసుకున్నాను. గతేడాది డిసెంబర్‌ 9న ఎస్‌వీబీసీలో చానల్‌లో ‘అదిగో అల్లదిగో’ ప్రోగ్రాంకు పాట పాడే అవకాశం వచ్చింది. అక్కడ ‘ఏమి చేయవచ్చునే’ అనే అన్నమయ్య కీర్తన పాడాను. న్యాయనిర్ణేతగా వచ్చిన ఎస్‌పీ శైలజ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది.

పాటతో బస్సు వచ్చింది 
ఈయేడాది జనవరి 14న ఓ తెలుగు చానల్‌లో సరిగమప కార్యక్రమానికి సెలెక్షన్‌ నిర్వహించారు. అందులో నేను ఎంపికై తొలుత ‘ఊరంత వెన్నెల.. మనసంతా చీకటి’ పాట పాడాను. నా పాటను మెచ్చి సంగీత సామ్రాట్‌ కోటి నీకు ఏమీ కావాలో కోరుకోమన్నారు. వెంటనే  మా గ్రామానికి బస్సు వేయాలని కోరా. అందుకు న్యాయనిర్ణేతలు అంగీకరించి ఏపీ మంత్రి పేర్ని నానితో మాట్లాడి డోన్‌ నుంచి దేవనకొండ వెళ్లే బస్సును మా గ్రామానికి వచ్చేలా చేశారు.

ఇందుకు సహకరించిన అందరికీ ప్రత్యేకంగా మా గ్రామం తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నా. అలాగే కర్నూలు నుంచి వయా ఈదుల దేవరబండ మీద మా గ్రామ సమీపంలోని బండపల్లె వరకు బస్సు వస్తుంది. అది కూడా మా గ్రామంలోకి వచ్చిపోతే వివిధ పనుల మీద నేరుగా కర్నూలుకు వెళ్లే రైతులకు మేలు జరుగుతుందని గాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు.  భవిష్యత్‌లో మంచి సింగర్‌గా స్థిరపడి జిల్లాలో సంగీత పాఠశాల ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వాలన్నదే తన ఆశయమని ఈ యువ గాయని చెప్పుకొచ్చారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top