28న అమృత్‌ కలశ్‌ యాత్ర ప్రత్యేక రైళ్లు 

Special trains for Amrit Kalash Yatra on 28th - Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): నా భూమి– నా దేశం ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుం­చి దేశ రాజధాని ఢిల్లీకి ఈ నెల 28న అమృత్‌ కలశ్‌ యాత్ర ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో వీరులు, వీరనారీమణులకు నివాళులర్పిస్తూ, వారి త్యాగాలను స్మరించుకుంటు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక శిలాఫలకాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 9వ తేదీన నా భూమి– నా దేశం కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

అందులో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు దేశంలోని మారుమూల గ్రామాలు, పట్టణాల నుంచి పవిత్ర మట్టి, బియ్యంను రాష్ట్ర రాజధానులకు ఈ నెల 22 నుంచి 27వ తేదీ లోపుగా తరలిస్తారు. అక్కడ నుంచి ఈ నెల 28 నుంచి 30వ తేదీ లోపు వాటిని దేశ రాజధాని ఢిల్లీకి రవాణా చేయనున్నారు.అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి, తెలంగాణాలోని సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 28న వారి కోసం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.  

ప్రత్యేక రైళ్లు ఇవీ: విజయవాడ–హజరత్‌ నిజాముద్దిన్‌ (07209) ప్రత్యేక రైలు ఈ నెల 28న ఉదయం 10 గంటలకు విజయవాడ స్టేషన్‌లో బయలుదేరి, ఆదివా­రం మధ్యాహ్నం 2.25 గంటలకు హజరత్‌ నిజాముద్దిన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్ర­యాణంలో ఈ రైలు (07210) నవంబర్‌ 1న రాత్రి 11 గంటలకు హజరత్‌ నిజా­ముద్దిన్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌–హజరత్‌ నిజాముద్దిన్‌ (07211) రైలు ఈ నెల 28న ఉదయం 10.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, ఆదివారం మ­ధ్యా­హ్నం 2.25 గంటలకు హజరత్‌ నిజాముద్దిన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07212) నవంబర్‌ 1న రాత్రి 11 గంటలకు హజరత్‌ నిజాముద్ది­న్‌­లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top