భూముల రీ సర్వేపై ప్రత్యేక దృష్టి

Special focus on land re-survey Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రాజెక్ట్‌ను నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తి చేసే క్రమంలో సమన్వయంతో ముందడుగు వేయాలని టేపీ జియో స్పేషియల్‌ డేటా సెంటర్, రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌ శాఖ అధికారులు నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయా శాఖల అధికారులు చర్చించారు. ఉప్పల్‌లోని సర్వే ఆఫ్‌ ఇండియా కార్యాలయంలో నిర్వహించిన ఈ కీలక సమావేశానికి 12 మంది నోడల్‌ అధికారులతో కలిసి రాష్ట్ర సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థజైన్‌ నేతృత్వం వహించగా, జియో స్పేషియల్‌ డేటా సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్వీ సింగ్‌ తన బృందంతో పాల్గొన్నారు.

డేటా సెంటర్‌కు సంచాలకులుగా సింగ్‌ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న రీసర్వే ప్రాజెక్ట్‌కు సంబంధించి పలు అంశాలపై లోతుగా చర్చించారు. ప్రాజెక్ట్‌ పురోగతి, ఇప్పటివరకు చేపట్టిన అంశాలు, ఇకపై చేయవలసిన కార్యక్రమాలు, కాలపరిమితి వంటి అంశాలపై సమావేశం సాగింది. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయడంతో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చ సాగింది.

మెరుగైన సామర్థ్యం కోసం సాంకేతికతను ఎలా ఉపయోగించుకోవాలి, మరిన్ని శిక్షణలు ఇవ్వాల్సిన ఆవశ్యకత తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సమావేశంలో సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ కార్యాలయ సంయుక్త సంచాలకుడు ప్రభాకరరావు, రాష్ట్ర సర్వే శిక్షణ అకాడమీ వైస్‌ ప్రిన్సిపాల్‌ కుమార్, ప్రత్యేక అధికారి అజయ్‌నాయక్‌  పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top