‘వెడ్డింగ్‌’ ఈవెంట్‌ ట్రెండింగ్‌.. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌పై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌

Special Focus On Event Management At Weddings In Telugu States - Sakshi

క్యాటరింగ్‌లోనూ పలు మార్పులు 

హైదరాబాద్‌ నుంచి వస్తున్న వంట పనివారు 

ఖర్చుకు వెనకాడని తల్లిదండ్రులు

కర్నూలు (టౌన్‌): పెళ్లంటే పందిళ్లు.. తాళాలు..తలంబ్రాలే కాదు..సరికొత్తగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా వీటికి జత కలిసింది. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్లి చేయాలంటే హైరానా పడేవారు. సమయానికి ఏవైనా ఇబ్బందులు వస్తాయేమోనని ఆందోళన చెందేవారు. ఇప్పుడు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహారాన్ని సులువు చేసింది.  పెళ్లి ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకు అంతా వారే చూసుకుంటున్నారు.   

జీవన శైలిలో మార్పుతో.. 
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. బంధువులంతా తలా ఒక చేయి వేసి పెళ్లి తంతును నడిపించేవారు.  వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలవుతుంది. నిశ్చితార్థం, మూహూర్తం, మంగళసూత్రధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, హోమం, అరుంధతీ నక్షత్ర దర్శనం ఇలా వివాహ వేడుకలో కీలక ఘట్టాలు ఉంటాయి.  కుటుంబసభ్యులు, బంధువులు కలిస్తే తప్ప ఈ తంతు సజావుగా సాగదు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు లేవు. మారిన జీవన శైలితో ఎవరికి వారు బిజీగా ఉన్నారు. వివాహ వేడుకల్లో పనిచేసే బంధువులు కరువయ్యారు. దీంతో చాలా మంది ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌పై ఆధారపడ్డారు. 


( ఫైల్‌ ఫోటో )

సినిమాటిక్‌ ఈవెంట్‌లా.. 
భారీ సెట్టింగ్‌లు.. ఎల్‌ఈడీ స్క్రీన్లు..అర్కెస్ట్రా..తదితర హంగులతో సినిమాటిక్‌ ఈవెంట్‌లా వివాహాలు జరు గుతున్నాయి. మేకప్‌ ఆర్టిస్టులు, క్యాటరింగ్‌ సర్వీసెస్, వెల్‌కమ్‌ గర్ల్స్‌... ఇలా సరికొత్తగా వేడుక సాగుతోంది. గతంలో ఇంటి పెద్దలు, తల్లిదండ్రులు వివాహ తంతును పర్యవేక్షణ చేసేవారు. నేడు యువతీయువకుల అభీష్టాల మేరకు పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదు.  

క్యాటరింగ్‌లో వినూత్న మార్పులు 
పెళ్లి వేడుకలో షడ్రుచులతో భోజనం ఏర్పాటు చేయడం అనవాయితీ. ఇప్పుడు క్యాటరింగ్‌లో మార్పులు వచ్చాయి. పనస పండు బిర్యానీ నుంచి రాయలసీమ రుచులు, కోనసీమ రుచులు, హైదరబాద్‌ బిర్యానీ వరకు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చాయి. వెడ్డింగ్, కార్పొరేట్, సోషల్‌ ఈవెంట్‌ క్యాటరింగ్‌లకు డిమాండ్‌ ఉంటోంది. కర్నూలు నగరంలో 10 వరకు పెద్ద స్థాయి క్యాటరింగ్‌లు ఉన్నాయి. వంట మనుషులను హైదరాబాద్‌ నుంచి కర్నూలు రప్పిస్తున్నారు. అతిథులకు ప్రత్యేక వంటకాలు అందించేందుకు కొంత మంది ఖర్చుకు వెనుకాడడం లేదు. 

సొంతంగా పెళ్లి మంటపాలు  
ఒకరు వాడిన మంటపాలు, షామియానాలు, సైడ్‌వాల్స్‌ కాకుండా ఉన్నస్థాయి వర్గాల వారు సొంతంగా పెళ్లి మంటపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం ఈవెంట్‌ మేనేజర్లు జర్మన్‌ హ్యాంగర్లు తెప్పిస్తున్నారు. బెస్ట్‌ ఫాక్ట్‌ వెడ్డింగ్‌ పేరుతో  3 వేల మంది నుంచి 10 వేల మందితో పెళ్లి తంతును ఘనంగా జరిపిస్తున్నారు. కర్నూలు నగరంలో 3 వేల మందితో ఎన్నో వివాహ కార్యక్రమాలు జరిగాయి. పెళ్లి మంటపాలను పూర్తి స్థాయిలో తాత్కాలికంగా నిర్మిస్తారు. డెకరేషన్‌ కోసం బెంగళూరు నుంచి పూలను తెప్పిస్తున్నారు. కాక్‌టెయిల్‌      పారీ్టలు, లైవ్‌ మ్యూజిక్, డ్యాన్స్‌ ఫ్లోర్‌ లైటింగ్‌.. ఇలా వివాహ తంతులో అధునికత కనిపిస్తోంది.  

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం 
సంప్రదాయాలను కొనసాగిస్తూ ఘనంగా వివాహం చేసుకోవాలన్న ఆలోచన పెరిగింది. అన్ని వ్యవహారాలు చక్కదిద్దుకునే క్రమంలో తల్లిదండ్రులకు కొన్ని  ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ మార్కెట్లోకి వచ్చింది. సినిమా ఈవెంట్స్‌ తరహాలో వేడుక నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.   
– సందీప్, ఈవెంట్‌ మేనేజర్, కర్నూలు 

కోరిన భోజనం అందిస్తున్నాం 
పెళ్లిళ్లలో క్యాటరింగ్‌ సంస్కృతి పెరిగింది. నిర్వాహకులు కోరిన విధంగా వంటకాలు తయారు చేస్తున్నాం. రైస్, పలావ్, 24 రకాల టిఫిన్స్, 53 రకాల స్వీట్‌. 25 రకాల నార్త్‌ ఇండియన్‌ ఐటమ్స్, నాన్‌వెజ్‌లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, నాటుకోడి..ఇలా  30 రకాల వంటకాలు అందిస్తున్నాం. హైదరాబాద్‌ నుంచి వంటవారిని రప్పిస్తున్నాం.  
– ఆవుల లింగన్న, క్యాటరింగ్‌ నిర్వాహకుడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top