గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ! | Special DSC announced for tribals and 100 percent reservation implemented: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ!

May 6 2025 5:26 AM | Updated on May 6 2025 5:26 AM

Special DSC announced for tribals and 100 percent reservation implemented: Andhra Pradesh

మంత్రి సంధ్యారాణికి వినతిపత్రాన్ని అందజేస్తున్నగిరిజన సంఘాల నాయకులు

ఏజెన్సీలో గిరిజన టీచర్లే.. వంద శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

టీడీపీ ఎన్నికల హామీ మేరకు జీవో 3ని పునరుద్ధరించాలి

మంత్రి సంధ్యారాణికి గిరిజన సంఘాల వినతిపత్రం

8న కెబినెట్‌ భేటీలో సానుకూల ప్రకటన రాకుంటే 

9 నుంచి ఆందోళనకు సన్నద్ధం

సాక్షి, అమరావతి, సాలూరు: గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించి నూరు శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని, జీవో 3 పునరుద్ధరణపై టీడీపీ కూటమి సర్కారు ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్‌ చేశాయి. మెగా డీఎస్సీలో పేర్కొన్న గిరిజన ప్రాంత పోస్టులను మినహా­యి­ంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలని పేర్కొన్నాయి. ఈమేరకు స్పెషల్‌ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ ప్రాంత ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ నెల 2, 3వ తేదీల్లో మన్యం బంద్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణిని కలిసిన గిరిజన సంఘాల నాయకులు పలు డిమాండ్లతో విన­తిపత్రాన్ని అందజేశారు. అనంతరం గిరిజన స­ంఘం నాయకులు అప్పలనరసయ్య, మాణిక్యం, శాంతికుమారి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్‌ సమావేశంలో డీఎస్సీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తెస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు. గిరిజనులకు వంద శాతం ఉద్యోగాల రి­జర్వేషన్‌పై ప్రత్యామ్నాయ జీవోను మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌కు ముందే ఇవ్వాలని కోరి­నట్లు చెప్పా­రు. 16 వేల టీచర్‌ పోస్టుల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం గిరిజన అభ్యర్థులకు 900 నుంచి 1,000 ఉద్యోగాలే వస్తాయని, మంత్రి మాత్రం 2,024 పోస్టులు వస్తాయని పేర్కొనటంపై స్పష్టత ఇవ్వాలని కోరామన్నారు. కేబినెట్‌ సమావేశంలో గిరిజన యువతకు న్యాయం జరగకుంటే ఈ నెల 9వ తేదీన గిరిజన సంఘాల నాయకులు, యువతతో కలసి భవిష్యత్‌ పోరాట ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. 

ఏడాదిగా హామీని నెరవేర్చకుండా..
గిరిజన ప్రాంతాల్లో వంద శాతం ఉద్యోగాలు గిరి­జ­నులకే! జీవో నెంబర్‌ 3 చెబుతోంది ఇదే! న్యాయపరమైన చిక్కుల వల్ల సుప్రీంకోర్టు కొట్టివేసిన ఈ జీవో­ను పునరుద్ధరించి గిరిజన ప్రాంతాల్లో టీచర్‌ ఉద్యోగాలు వారికే దక్కేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీని టీడీపీ కూటమి సర్కారు గాలికి వది­లేసింది. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కులను తొలగించడంలో ఉదాసీ­న­­ంగా వ్యవహరించిన సీఎం చంద్రబాబు జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరిస్తామంటూ 2024 ఎన్నికలకు ముందు అరకు బహిరంగ సభలో హామీలివ్వగా సాలూ­రు, పార్వతీపురం, పాలకొండ సభల్లో నారా లోకేశ్‌ మోసపూరిత హామీలిచ్చి గిరి­జనులను మభ్యపెట్టారు.

మేనిఫె­స్టోలోనూ దీన్ని పొందుపరిచారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటామని ఆదివాసీ దినో­­త్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పునరుద్ఘాటించారు. టీడీపీ ఎమ్మె­­ల్సీగా ఉన్నప్పుడు కూడా తమ ప్రభుత్వం రాగానే జీవో నెంబర్‌ 3 పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడాది కావస్తున్నా ఎన్నికల హామీ మేరకు జీవో 3ని పునరుద్ధరించకపోవడంపై గిరిజన యువత మండిపడుతోంది.

జీవో 3 పునరుద్ధరించాకే డీఎస్సీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమబాట పట్టింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ తనూజరాణి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్య­­లింగం, ఎం.విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యేలు కె.­భాగ్య­లక్ష్మి, చెట్టిఫల్గుణ, ఎమ్మెల్సీ కుంభా రవి­బాబు, ఉమ్మ­డి విశాఖ జెడ్పీ మాజీ చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర తదితరులు గిరిజనులకు బాసటగా నిలిచారు.

అవగాహన లేక అబద్ధాలు..
జీవో 3 పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనులకు నూరు శాతం టీచర్‌ పోస్టులు దక్కేలా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషిని కొనసాగించాలి. సుప్రీం కోర్టు జీవోను రద్దు చేసినప్పుడు వైఎస్‌ జగన్‌ తక్షణం స్పందించి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, మంత్రి, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. దురదృష్టవశాత్తూ అప్పీల్‌ను సైతం సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ గిరిజన యువతకు న్యాయం చేయడంపై అడ్వకేట్‌ జనరల్, లీగల్‌ టీమ్, గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించారు. 5, 6 షెడ్యూల్డ్‌లో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి గిరిజనులు నష్టపోతున్నారు.

దీంతో గిరిజనులకు మేలు జరిగేలా 5వ షెడ్యూల్‌ క్లాజ్‌ నెంబర్‌ 2లో సవరణ ప్రతిపాదనపై నోట్‌ రూపొందించి కేంద్రానికి పంపించారు. గిరిజన సలహా కమిటీ సమావేశాల్లో ఆమోదించిన తీర్మానాలను కేంద్రానికి అందచేశాం. గిరిజనులపై ప్రేమతో వైఎస్‌ జగన్‌ ఇంత చేస్తే కనీస అవగాహనలేని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లాయర్‌ను కూడా పెట్టలేదని అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేసిందో మినిట్స్‌తో సహా వివరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. చేతనైతే బహిరంగ చర్చకు రావాలి. – కుంభా రవిబాబు, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ

జీవో పునరుద్ధరించి డీఎస్సీ ప్రకటించాలి
జీవో నెంబర్‌ 3ను పునరుద్ధరించి షెడ్యూల్డ్‌ ఏరియాలో నూరు శాతం టీచర్‌ పోస్టులు గిరిజనులకే ఇస్తామని ఎన్నికల్లో హామీలిచి్చన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మోసం చేయడం దారుణం. గిరిజనులకు ఆరు శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే వంద శాతం వారికే ఇస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నాకే డీఎస్సీ నిర్వహించాలి. గిరిజనులకు న్యాయం చేసేలా ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలి. 
– పీడిక రాజన్నదొర, మాజీ ఉపముఖ్యమంత్రి

సంధ్యారాణి అబద్ధాలు కట్టిపెట్టాలి
జీవో 3 పునరుద్ధరణ హామీని నెరవేర్చకుండా వైఎస్సార్‌ సీపీపై నిందలు మోపి డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడపడం సిగ్గుచేటు. గిరిజనుల మేలు కోసం వైఎస్సార్‌సీపీ చేసిన కృషిని తెలుసుకోకుండా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అబద్ధాలు చెబుతున్నారు. గత ప్రభుత్వం లాయర్‌ను నియమించలేదంటూ అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. 15 ఏళ్లకు పైగా కేసు నడిచినా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సుప్రీం కోర్టులో కనీసం లాయర్‌ను కూడా నియమించలేదు. ఇప్పటికైనా గిరిజనులకు న్యాయం చేయాలి.
– పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఉపముఖ్యమంత్రి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement