పరిశ్రమలకు వారానికో రోజు పవర్‌ హాలిడే

SPDCL CMD Announces Power Holiday For Industries - Sakshi

సాక్షి, తిరుపతి రూరల్‌: ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్‌ హాలిడే అమలు చేయనున్నట్లు ఆ సంస్థ సీఎండీ హరనాథ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో పుత్తూరు డివిజన్‌ను మినహాయించి, మిగతా అన్ని డివిజన్లలో శుక్రవారం పవర్‌ హాలిడే అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

విద్యుత్‌ వినియోగం బాగా పెరిగిన నేపథ్యంలో గృహ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం పరిశ్రమలకు వారానికోరోజు వారాంతపు సెలవులను అమలు చేస్తున్నాయని, దీనికి అదనంగా ఒకరోజు పవర్‌ హాలిడేను అమలు చేయాలని పారిశ్రామిక వినియోగదారులకు సూచించారు. ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు పవర్‌ హాలిడే అమలులో ఉంటుందన్నారు. ప్రస్తుతం కోవిడ్‌–19 పరిస్థితుల నుంచి బయటపడుతున్న నేపథ్యంలో పరిశ్రమలు, వాణిజ్య విద్యుత్‌ వినియోగం అధికమైందన్నారు.

విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో బొగ్గు లభ్యత లేకపోవడం, పవర్‌ ఎక్స్‌చేంజ్‌లలో డిస్కమ్‌లకు 14వేల మెగావాట్ల విద్యుత్తు అవసరం కాగా కేవలం 2వేల మెగా వాట్ల విద్యుత్‌ మాత్రమే ఉన్నందున సమస్యకు కారణమవుతోందన్నారు. విద్యుత్‌ కోతల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. విద్యుత్‌ సరఫరా తీరును ప్రతిరోజూ సమీక్షించి, మెరుగై నసరఫరాకు తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.   

చదవండి: (Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top