Nandyal District: నెరవేరబోతోన్న రేనాటి ప్రాంత వాసుల కల

Nandyal Yerraguntla Railway Line Electrification is Completed - Sakshi

నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య పూర్తయిన విద్యుత్‌ రైల్వేలైన్‌   

రూ.250 కోట్లతో 126 కిలోమీటర్ల పనులు 

పారిశ్రామికంగా అభివృద్ధి చెందనున్న రేనాటి గడ్డ

బనగానపల్లె (నంద్యాల జిల్లా): రేనాటి ప్రాంత వాసుల కల నెరవేరుతోంది. త్వరలోనే విద్యుత్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. నంద్యాల, ఎర్రగుంట్ల మధ్య 126 కిలోమీటర్ల మేర విద్యుత్‌ లైన్‌ పనులను గతేడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.250 కోట్లతో ఈ పనులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేసి, దక్షిణ మధ్య రైల్వేకు అప్పగించారు. గత నెల 29వ తేదీన రైల్వే సేఫ్టీ అధికారి అభయకుమార్‌ రాయ్‌ ఆధ్వర్యంలో ట్రైల్‌ రన్‌ నిర్వహించారు. దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ డివిజన్‌ ఇంజినీర్‌ సంజీవకుమార్‌ బృందం కూడా శుక్రవారం రెండోసారి ట్రైల్‌ రన్‌ నిర్వహించింది. అతి త్వరలో విద్యుత్‌ రైళ్ల రాకపోకలు కొనసాగనున్నాయి.
 
పారిశ్రామికంగా అభివృద్ధి 
నంద్యాల, ఎర్రగుంట్ల విద్యుత్‌ రైల్వే లైన్‌ పూర్తికావడంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఈ లైన్‌లో గూడ్స్‌ సర్వీస్‌లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రేనాటి గడ్డ పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుంది. రేనాటి గడ్డలో పలు సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. గనుల నుంచి నాపరాతిని, ఫ్యాక్టరీల నుంచి పాలిష్‌ రాళ్లను ఇతర ప్రాంతాలను ఎగుమతి చేస్తున్నారు. గూడ్స్‌ సర్వీసులు పెరిగితే ఫ్యాక్టరీలు అభివృద్ధి చెందనున్నాయి. పలువురికి ఉపాధి లభించనుంది.   

పెరగనున్న రైలు సర్వీసులు 
కరోనాతో ప్రస్తుతం ఈ మార్గంలో డెమో రైలు సేవలు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ప్రస్తుతం ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ మాత్రమే నడుస్తోంది. విద్యుత్‌ లైన్‌ పూర్తికావడంతో డెమో రైల్‌తో పాటు మరిన్ని ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2016లో రైల్వేలైన్‌ ప్రారంభ సమయంలో నంద్యాల నుంచి తిరుపతికి ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ నడుపుతామని అధికారులు ఇచ్చిన హామీ ఇంత వరకు నేరవేరలేదు. హామీ నెరవేర్చాలని ఎంపీలు అవినాష్‌రెడ్డి, పోచా బ్రహ్మానందరెడ్డి రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సర్వీస్‌ను నడిపేందుకు రైల్వే అధికారులు తప్పక చర్యలు తీసుకునే అకాశం ఉంది.   

త్వరలోనే విద్యుత్‌ రైళ్ల రాకపోకలు 
నంద్యాల, ఎర్రగుంట్ల రైలు మార్గం గుండా గూడ్స్‌ సర్వీస్‌లు విద్యుత్‌ సౌకర్యంతోనే నడుస్తున్నాయి. అనుకు న్న సమయానికన్నా ముందే విద్యుత్‌ లైన్‌ పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ఈ మార్గం ద్వారా విద్యుత్‌ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయి. రైళ్ల సర్వీసులు కూడా పెరిగే అవకాశం ఉంది. – సంజీవకుమార్, సీనియర్‌ డివిజనల్‌ ఇంజినీర్, దక్షిణ మధ్య రైల్వే  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top