
రాయలసీమలోకి నైరుతి.. 10 నాటికి రాష్ట్రమంతటా రుతుపవనాల విస్తరణ
సాక్షి, విశాఖపట్నం: వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలున్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు – కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతోపాటు, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి విస్తరించాయి. 3–4 రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, అండమాన్‌లోని మిగిలిన ప్రాంతాలతోపాటు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో భిన్న వాతావరణం
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఈదురుగాలుతో వాతావరణం దోబూచులాడింది. ఒకట్రెండు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. మరికొని్నచోట్ల ఓ మోస్తరు వానలు పడ్డాయి. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో వాయువ్య, నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణం నెలకొందని నిపుణులు చెబుతున్నారు.
నేడు, రేపూ ఎండా, వాన దోబూచులాటే..!
శుక్ర, శనివారాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. శుక్రవారం రాయలసీమలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపారు.

శుక్రవారం ఉత్తరాంధ్రలో 10 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని, అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో నిడమర్రు, అమలాపురంలో 54 మిమీ, కాజులూరులో 42, కె.కోటపాడులో 41, ఉంగుటూరులో 35, కరపలో 32.2, పిఠాపురంలో 31.7 మిమీ వర్షపాతం నమోదైంది.
పలమనేరులో భారీ వర్షం
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో దద్దరిల్లింది. ఈదురు గాలుల వల్ల పలుచోట్ల మామిడి నేల రాలింది. కోతకొచి్చన టమాట పంట దెబ్బతింది. తీగపంటలైన కాకర, బీర, బీన్స్, రాగి పంటలు నేలవాలాయి. కొన్ని చోట్ల అరటిపంటకు నష్టం వాటిల్లింది. నడిమిదొడ్డిపల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది.