ఎండ.. వాన | Southwest monsoon has hit Kerala will enter the state soon | Sakshi
Sakshi News home page

ఎండ.. వాన

Jun 5 2026 5:26 AM | Updated on Jun 5 2026 5:26 AM

Southwest monsoon has hit Kerala will enter the state soon

రాష్ట్రంలో విభిన్న వాతావరణం

మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత 

మన్యం జిల్లా పాచిపెంటలో 3 సెంటీమీటర్ల వర్షపాతం 

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు త్వరలో రాష్ట్రంలోకి ప్రవేశం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గురువారం ఎండ, వానతో విభిన్న వాతావరణం నెలకొంది. పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఎండ, వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేయగా.. సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

శుక్రవారం పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని పలుచోట్ల 42 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.  

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు
మరోవైపు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 3 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా తాడేపల్లి 2.7, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 1.8, విజయనగరం జిల్లా గుర్లలో 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 

శుక్రవారం పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి. ఇదే విధంగా ముందుకు కదలితే 7, 8 తేదీల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు వచి్చనా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement