స్మార్ట్‌ షాక్‌ | Smart Meters In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ షాక్‌

Aug 3 2025 6:09 AM | Updated on Aug 3 2025 6:09 AM

Smart Meters In Andhra Pradesh

కొనసాగుతున్న స్మార్ట్‌ మీటర్ల బిగింపు

కోనసీమ జిల్లాలో 6.32 లక్షల విద్యుత్‌ సర్విసులు

తొలి దశలో కేటగిరీ –2  సర్వీసులకు ఏర్పాటు

వినియోగదారుల ఆవేదన

సాక్షి, అమలాపురం: తమపై విద్యుత్‌ భారం పడుతుందని వినియోగదారులు.. తమ ఉపాధికి ఇబ్బంది కలుగుతుందని అని మీటర్‌ రీడర్లు ఆందోళన వ్యక్తం చే­స్తున్నా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై ఏపీఈపీడీసీఎల్‌ వె­న­క్కు తగ్గడం లేదు. ఎంత మంది వేడుకున్నా, ఆందోళ­న­కు దిగుతామని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లే­దు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో స్మార్ట్‌ మీటర్ల బి­గింపును వేగవంతం చేశారు. దీనితో ఈ నెల 5వ తేదీ నుంచి ఆందోళనలకు ప్రజా సంఘాలకు సిద్ధమవుతున్నా­యి.  

49,325 సర్వీసులకు ఏర్పాటు 
కోనసీమ జిల్లాలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు వినియోగదారులు గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ క్యాటగిరీలలో 6.32 లక్షల విద్యుత్‌ సర్విసులున్నాయి. తొలి విడతలో క్యాటగిరీ–2 పరిధిలో ఉన్న షాపులు, పరిశ్రమలు, సినిమా హాళ్లు, ఎక్కువ విద్యుత్తు వినియోగించే వ్యాపార సంస్థలకు సర్విసులకు స్మార్ట్‌ మీటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 63,686 సర్విసులు క్యాటగిరి– 2 పరిధిలో ఉండగా, ఇంత వరకు 49,325 విద్యుత్‌ సర్విసులకు స్మార్ట్‌ మీటర్లు వేయడం పూర్తి చేశారు.

ఈ మీటర్ల ఏర్పాటుపై వ్యాపార సంఘాల నుంచి వ్యతిరేకత వస్తున్నా విద్యుత్‌ శాఖ అధికారులు వెనకడుగు వేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో మీటర్లు వేయవద్దని అడ్డుకుంటున్నా లెక్క చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 5,43,481 సర్విసులు క్యాటగిరీ –1లో ఉన్నాయి. వీటికి స్మార్ట్‌ మీటర్లు వేసేది లేదని అధికారులు చెబుతున్నా వినియోగదారులలో నమ్మకం కలగడం లేదు. ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, అటు కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఒక కార్పొరేట్‌ సంస్థకు మేలు చేయాలనే బలమైన సంకల్పంతో ఉండడం వల్ల కేటగిరీ–1లో ఉన్న గృహాలకు కూడా రెండో దశలో స్మార్ట్‌ మీటర్లు బిగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.   

అభ్యంతరాలు ఇవే 
స్మార్ట్‌ మీటర్ల బిగింపు భారం వినియోగదారులపై ఉండదని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే ఆ భారం ఏదో ఒక రూపంలో తమపై వేస్తారని వినియోగదారుల ఆందోళన చెందుతున్నారు. స్మార్ట్‌ మీటర్‌ ఖర్చు సింగిల్‌ ఫేజ్‌కు రూ.9 వేలు, త్రీఫేజ్‌కు రూ.17 వేల చొప్పున మొత్తం 93 నెలల్లో వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచే వసూలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందన సర్దుబాటు చార్జీల పేరుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్న విషయాన్ని వినియోగదారులు గుర్తు చేస్తున్నారు.  

⇒ ఏదైనా కారణాల వల్ల స్మార్ట్‌ మీటర్‌ పాడైపోతే సొమ్ములు చెల్లించి కొత్త మీటర్‌ మార్చుకోవాలి. 
⇒ స్మార్ట్‌ మీటర్‌ పెట్టిన తర్వాత గంట గంటకూ రీడింగ్‌ తీస్తారు. పగలు కంటే రాత్రి వాడే కరెంటుకు అధిక బిల్లులు వేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేస్తారని వినియోగదారుల అనుమానం.  
⇒ విద్యుత్‌ బిల్లులలో తప్పులకు సమాధానం చెప్పే నాథుడే ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ఏర్పడుతుందనే అనుమానాలున్నాయి.  

5న సబ్‌ స్టేషన్ల ముట్టడి  
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైపు విద్యుత్‌ చార్జీల బాదుడు, మరో వైపు స్మార్ట్‌ మీటర్ల భారంతో వినియోగదారులు సతమతమవుతున్నారు. దీనిపై ఈ నెల 5వ తేదీన విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల ముట్టడికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. బలవంతంగా బిగిస్తున్న స్మార్ట్‌ మీటర్లను తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజావేదిక ఆధ్వర్యంలో అమలాపురం సీఐటీయూ కార్యాలయంలో ఇటీవల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగిన విసయం తెలిసిందే. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గా ప్రసాద్, ఏఐటీయూసీ నాయకుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, వ్యవసాయ కారి్మక సంఘం, కౌలు రైతు సంఘం తదితర ప్రజా సంఘాల ముఖ్య నాయకులు హాజరయ్యారు.  

ఉపాధికి ఎసరు  
స్మార్ట్‌ మీటర్ల వల్ల తాము ఉపాధి కోల్పోతామనే ఆందో­ళనలో మీటర్‌ రీడర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యా­ప్తంగా సుమారు 500 మంది వరకు ఉండగా కోనసీమ జిల్లాలో సుమారు 180 మంది వరకు ఉన్నారని అంచనా. వీరికి నెలకు సగటున రూ.పది వేల వరకు వస్తోంది. స్మార్ట్‌ మీటర్ల వల్ల తమ ఉద్యోగాలకు ఇబ్బంది ఏర్పడుతుందని వీరు ఆందోళన చెందుతున్నారు. వీరందరూ పొట్టకూటి కోసం పోరుబాట పట్టారు. ఇప్పటికే కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.  

భవిష్యత్తులో ఇబ్బందులు 
విద్యుత్‌ స్మార్ట్‌ మీ­టర్ల ఏర్పాటు వల్ల వినియోగదారులకు భవిష్యత్తులో పలు రకాల ఇబ్బందులు రానున్నాయి. ఇది వినియోగదారులకు మోయలేని భారంగా 
మారనుంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు నిరసనగా ఈనెల 5న చేపట్టే ఆందోళనకు అన్నివర్గాల ప్రజలు ముందుకు రావాలి.
– కొప్పుల సత్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు 

అపోహలొద్దు 
విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల బిగింపుపై అపోహలు వద్దు. వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదు. పాత మీటర్లతో పోలిస్తే స్మార్ట్‌ మీటర్ల ద్వారా వ్యవస్థలో పారదర్శక పెరుగుతుంది. స్మార్ట్‌ మీటర్‌ కన్సూ్యమర్‌ యాప్‌ ద్వారా 247కు కనెక్ట్‌ అయి ఉంటాయని, ఫలితంగా వినియోగదారులు తమ వినియోగాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. – బి రాజేశ్వరి, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ, కోనసీమ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement