హౌసింగ్‌ ఏఈలకు ‘షోకాజ్‌’

Showcause Notices to non-progressive Housing AEs - Sakshi

పురోగతి చూపని ఏఈలకు నోటీసులు 

ఇప్పటివరకు 14.18 లక్షల మందికి ఇళ్లు మంజూరు 

కేవలం 1.40 లక్షల మంది ఆప్షన్లు మాత్రమే నమోదు

గృహాలు మంజూరైన లబ్ధిదారుల ఆప్షన్లు ఆన్‌లైన్‌లో నమోదు నత్తనడక 

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇప్పటికే లక్షలాది మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం వారికి ఇళ్లు కూడా మంజూరు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ వేలాది మంది పేదలకు ఇంటి స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తోంది. స్థలాలు అందుకున్న లబ్ధిదారుల నుంచి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్లు సైతం ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని ఏ తరహాలో నిరి్మంచుకుంటారనేది లబ్ధిదారులే నిర్ణయించుకుని.. తమ ఆప్షన్‌ ఏమిటో తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా లబ్ధిదారుల నుంచి వచ్చే ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసే పనిని గృహ నిర్మాణ శాఖకు అప్పగించగా.. దానిని ఆన్‌లైన్‌ చేయడంలో ఆ శాఖ ఏఈలు క్రియాశీలకంగా పని చేయడం లేదు.  

1.40 లక్షల మంది ఆప్షన్లు మాత్రమే నమోదు 
మొదటివిడత కింద రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటివరకు 14.18 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే, వీరిలో కేవలం 1.40 లక్షల మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే అప్షన్లు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో నమోదులో పురోగతి సాధించని ఏఈలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని హౌసింగ్‌ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అలాంటి ఏఈల జాబితాలను సిద్ధం చేశారు. ఇప్పటికే అనంతపురం కలెక్టర్‌ పలువురు హౌసింగ్‌ ఏఈలకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లోని ఏఈలకూ షోకాజ్‌ నోటీసులు జారీచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

చివరి స్థానంలో చిత్తూరు జిల్లా 
లబ్ధిదారుల ఆప్షన్ల ఆన్‌లైన్‌ నమోదులో చిత్తూరు జిల్లా అధికారులు చాలా వెనుకబడ్డారు. ఆ జిల్లాలో ఇప్పటివరకు 1,66,181 మందికి ఇళ్లు మంజూరు కాగా.. వారిలో కేవలం 29 మంది లబ్ధిదారుల నుంచి మాత్రమే ఆప్షన్లు తీసుకుని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలో 51,059 ఇళ్లు మంజూరు కాగా.. 777 మందికి సంబంధించి ఆప్షన్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. గుంటూరు జిల్లాలో 1,51,604 మందికి ఇళ్లు మంజూరు కాగా.. 982 మంది ఆప్షన్లు మాత్రమే నమోదయ్యాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top