ఇద్దరు వైద్యులపై పలువురు విద్యార్ధినుల ఫిర్యాదు

Sexual Harassment of Vijayawada Govt Dental Medical Students - sakshi - Sakshi

విద్యార్థినులకు లైంగిక వేధింపులు 

ఇద్దరు వైద్యులపై పది మందికిపైగా ఫిర్యాదు

లబ్బీపేట(విజయవాడతూర్పు): దంత వైద్య వృత్తిలో విద్యార్థినులకు నైపుణ్యాలను నేర్పాల్సిన వైద్యులు కీచకులుగా మారుతున్నారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులపై ఒక విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టగా అనేక అరాచకాలు వెలుగు చూస్తున్నాయి. పది మందికిపైగా విద్యార్థినులు, మహిళా సిబ్బంది తమను కూడా లైంగికంగా వేధించారంటూ ఇద్దరు వైద్యులపై విచారణ కమిటీ ఎదుట పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ యుగంధర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

అసలేం జరిగిందంటే... 
ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బీడీఎస్‌ చదువుతున్న ఒక విద్యార్థినిని కొంత కాలంగా ఓ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయం ఆమె స్నేహితుల ద్వారా తండ్రి, సోదరుడికి తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుండగా, తాను విచారణ చేసి చర్యలు తీసుకుంటానని ప్రిన్సిపాల్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు కళాశాలలోని ఉమెన్‌ గ్రీవెన్స్‌ సెల్‌ సభ్యులను విచారణ చేపట్టాలని ఆదేశించారు.  

మరిన్ని అరాచకాలు.. 
దంత వైద్య కళాశాలలో ఉమెన్‌ గ్రీవెన్స్‌ సెల్‌ సభ్యులు విద్యార్థినులను, మహిళా ఉద్యోగినులను పిలిచి విచారిస్తున్నారు. ఈ విచారణలో పది మందికిపైగా తమను ఇద్దరు వైద్యులు లైంగికంగా వేధించినట్లు పేర్కొన్నారు. వారిలో ఇద్దరు ముగ్గురు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మిగిలిన వారంతా మౌఖికంగా చెప్పినప్పటికీ, రాత పూర్వకంగా రాసేందుకు భయపడుతున్నట్లు సమాచారం.   

గతంలోనూ ఆరోపణలు.. 
ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్‌లపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒక విద్యార్థినిని వేధింపులకు గురిచేయగా, ఒక మహిళా ప్రొఫెసర్‌ అతనిపై ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ నాటి ప్రిన్సిపాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడంతో అప్పట్లో ఏ చర్యలు తీసుకోకుండానే మాఫీ చేశారు. 

విచారణ చేస్తున్నాం..  
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై కళాశాల ఉమెన్‌ గ్రీవె న్స్‌ సెల్‌ సభ్యులు విచారణ చేస్తు న్నారు. ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యునితో పా టు, మరొకరు కూడా వేధింపులకు పాల్పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి డీఎంఈకి నివేదిస్తాం.  
– డాక్టర్‌ యుగంధర్, ప్రిన్సిపాల్,ప్రభుత్వ దంత వైద్య కళాశాల 

చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top