
వైఎస్సార్ జిల్లాలో కారుపైకి దూసుకొచ్చిన లారీ.. అక్కడికక్కడే నలుగురు మృతి.. కారు నుజ్జునుజ్జు
ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విచారం
విజయవాడలో విద్యుదాఘాతానికి ముగ్గురు మృత్యువాత
కొద్దిగంటల్లో ఇల్లు ఖాళీ చేయాల్సి ఉండగా దుర్ఘటన
చింతకొమ్మదిన్నె/సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన దుర్ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. విజయవాడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కరెంట్ షాక్ ముగ్గురు బలయ్యారు. వివరాలివీ..
కారుపైకి లారీ దూసుకొచ్చి..
వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతానికి చెందిన బసినేని శ్రీకాంత్‌రెడ్డి, బి. కోడూరుకు చెందిన కోగటం తిరుపతిరెడ్డి కుటుంబాలు బెంగళూరులో ఉంటున్నాయి. వీరిలో శ్రీకాంత్‌రెడ్డి బెంగళూరులో.. తిరుపతిరెడ్డి జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తిరుపతిరెడ్డి ఇటీవలే స్వదేశానికి వచ్చి వారం రోజుల కిందట తిరిగి జర్మనీకి వెళ్లాడు. ఈ క్రమంలో.. శ్రీకాంత్‌రెడ్డి (32), తన భార్య శిరీష (28), కుమార్తె త్రిషికారెడ్డి (3).. తిరుపతిరెడ్డి భార్య శశికళ (35), కుమార్తె సాయి హర్షిత (9), కుమారుడు రిషికేశవర్‌రెడ్డి (8), శశికళ సోదరి స్వర్ణ (38) కడప జిల్లా బద్వేలుకు శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి బయల్దేరారు.
సమీప బంధువులైన వీరంతా తమ స్వగ్రామం బద్వేలు మండలం చిన్న పుత్తాయపల్లెలోని శ్రీరాముల దేవాలయంలో జరిగే ఉత్సవంలో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరి కారు కడప–చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్.. చింతకొమ్మదిన్నె రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వద్దకు వచ్చిoది.
అదే సమయంలో ఎరువుల లోడుతో విల్లుపురం నుంచి హైదరాబాదుకు వెళ్తున్న లారీ వెనక నుంచి వేగంగా వచ్చి, కారుపైకి దూసుకెళ్లింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో శ్రీకాంత్‌రెడ్డి, శిరీష, రిషికేశవర్‌రెడ్డి, సాయిహర్షిత అక్కడికక్కడే మరణించారు. ప్రమాదాన్ని పసిగట్టి శ్రీకాంత్, శిరీషలు తమ కుమార్తె చిన్నారి త్రిషికారెడ్డిని కారు నుంచి బయటకు తోసేయగా మట్టి కుప్పలపై పడి గాయపడింది.
చింతకొమ్మదిన్నె సీఐ శంకర్ నాయక్, డీటీఆర్‌బీ (డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో) సీఐ మహమ్మద్ బాబా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. క్రేన్ సాయంతో కారు, లారీని వేరుచేశారు. కారులో ఇరుక్కుపోయిన నాలుగు మృతదేహాలను బయటికి తీసేందుకు గంటన్నరసేపు శ్రమించాల్సి వచి్చంది. క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించి మెరుగైన వైద్యసేవలను అందిస్తున్నారు.
దుస్తులు ఆరేస్తుండగా కరెంట్ షాక్..
విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని చంద్రబాబునాయుడు కాలనీ సాయిటవర్స్ అపార్ట్‌మెంట్‌లో కాకినాడు జిల్లా సామర్లకోటకు చెందిన చలాది రామదుర్గా ప్రసాద్ (55), రాధ (45) ఉంటున్నారు. ప్రసాద్ లారీడ్రైవర్‌గా పనిచేసేవారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ప్రసాద్ చెల్లి ఊటుకూరి ముత్యావళి (42) ఇంటి ముందు ఇనుప తీగపై దుస్తులు ఆరేసేందుకు వెళ్లింది.
కరెంట్ వైరు, కేబుల్ వైరు, దుస్తులు ఆరేసే తీగ అన్నీ కలిపి ఉన్నాయి. వర్షాలతో ఎర్త్‌వైర్‌కు విద్యుత్ సరఫరా అవడంతో తీగపై దుస్తులు వేయగానే ముత్యావళి విద్యుదాఘాతానికి గురై కేకలు వేసింది. ఆమెను రక్షించేందుకు వెళ్లిన ప్రసాద్, రాధ షాక్‌కు గురయ్యారు. ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఫ్లాట్ ఖాళీచేస్తున్న తరుణంలో..
కుటుంబ తగాదాల నేపథ్యంలో ప్రసాద్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను కోర్టు ఆదేశాలతో శుక్రవారం ఖాళీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ముత్యావళి రెండ్రోజుల క్రితం కడియం నుంచి వచ్చింది. సామగ్రిని తరలించేందుకు అన్నీ సర్దుకుని మరికొన్ని గంటల్లో బయల్దేరుతారనగా ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురి మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వీరి ఇంట్లో లభించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా రాజమహేంద్రవరంలోని వారి బంధువులకు పోలీసులు సమాచారమిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రమాదం జరిగిన ఇంటికి వెళ్లి స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.