ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ

Set Back To Raghu Ramakrishna Raju Rushikonda Hills Constuction - Sakshi

సాక్షి, ఢిల్లీ: ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రుషి కొండలో నిర్మాణాలకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే అంశంపై రెండు చోట్ల పిటిషన్లపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. బుధవారం అనుమతులు మంజూరు చేసింది. 

రుషి కొండ‌పై టూరిజం భ‌వ‌నాల నిర్మాణాలు చేపట్టకుండా ఎన్జీటి స్టే విధించగా.. దానిని సవాల్‌ చేస్తూ ఏపీ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచార‌ణ‌ జరిగింది. మంగళవారం వాదనల సందర్భంగా.. ఎన్జీటీ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం, ఇవాళ(బుధవారం) రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం రఘురామ లేఖ ఆధారంగానే ప్రాజెక్టుపై స్టే ఇవ్వడం సరికాదన్న సుప్రీం కోర్టు.. కోర్టులను చేరుకోలేని వారు రాసే లేఖలను మాత్రమే పిటిషన్లుగా పరిగణించాలంటూ స్పష్టం చేసింది.

ఇక ఇవాళ ఆదేశాల సందర్భంగా.. ముందుగా చ‌దును చేసిన ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు ఏపీ సర్కార్‌కు అనుమ‌తిచ్చిన సుప్రీంకోర్టు..ఇప్ప‌టికే నిర్మాణాలున్న ప్రాంతంలో య‌థావిధిగా నిర్మాణాలు చేసుకోవ‌చ్చ‌ని స్పష్టం చేసింది. అలాగే తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దన్న సుప్రీం.. కేసులోని మెరిట్స్‌పై తామెలాంటి వ్యాఖ్య‌లు చేయ‌ద‌ల‌చుకోలేద‌ని స్పష్టం చేసింది. 

అంతేకాదు రుషికొండ ప్రాజెక్టు కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది.  ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని తేల్చిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంతవరకు ఎన్జీటీలో విచారణ జరపరాదని ఆదేశించింది. 

ఎన్జీటీలో జరిగే విచారణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదుపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న ప్రాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top