నల్లధనం చేర్చింది ఆ నలుగురే.. సింగపూర్‌ రూటులో ‘స్కిల్‌’ లూటీ!

Scam of TDP elders with shell companies in name of Siemens - Sakshi

సీమెన్స్‌ పేరిట షెల్‌ కంపెనీలతో టీడీపీ పెద్దల స్కామ్‌

సింగపూర్‌ నుంచి హవాలా ద్వారా తిరిగి వారి ఖాతాల్లోకి

కీలక ఆధారాలు లభ్యం.. సూత్రధారుల అరెస్టులకు ఈడీ రెడీ

దీనికోసమే ఆ నలుగురినీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌  

సాక్షి, అమరావతి: రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధులను టీడీపీ పెద్దలు షెల్‌ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్లు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పాత్ర ఉన్నట్లు దాదాపుగా నిర్థారణకు వచ్చింది. టీడీపీ హయాంలో “ముఖ్య’నేత నలుగురు వ్యక్తుల ద్వారా నల్లధనాన్ని సింగపూర్‌కు తరలించినట్లు ఆధారాలతో గుర్తించింది. సీమెన్స్‌కు సంబంధం లేకపోయినా ఆ సంస్థ పేరిట కాగితాలపై రూ.3,300 కోట్ల ప్రాజెక్టును చూపించి... రూ.370 కోట్లను కాజేసినట్లు తేల్చింది. ఈ అక్రమాలను ఇప్పటికే సీఐడీ అధికారులు నిగ్గు తేల్చారు. ఈడీ కూడా సీమెన్స్‌లో పని చేసి మానేసిన సుమన్‌బోస్‌... ఈ వ్యవహారంలో చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరించినట్లు తేల్చింది. 

నల్లధనం సింగపూర్‌కు చేర్చింది ఆ నలుగురే... 
స్కామ్‌లో కాజేసిన సొమ్మును ఈ నలుగురి ద్వారా సింగపూర్‌కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. నిందితులు నలుగురికీ అప్పటికే డస్సల్డ్‌ సిస్టమ్స్‌ అనే షెల్‌ కంపెనీతో అనుబంధం ఉంది. సుమన్‌ బోస్‌ను టీడీపీ పెద్దలు ఈ కుంభకోణంలో కీలక పాత్రధారిగా చేసుకున్నారు. సీమెన్స్‌ ఇండియా మాజీ హెడ్‌ కావటంతో... బోస్‌ జర్మనీలోని తమ ప్రధాన కార్యాలయానికి తెలీకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టీడీపీ పెద్దలు కాగితాలపై సృష్టించిన రూ.3,300 కోట్ల ప్రాజెక్టుపై తనే సంతకం చేసేశాడు.

డిజైన్‌టెక్‌తోపాటు అలైడ్‌ కంప్యూటర్స్, ఇన్‌వెబ్‌ సర్వీసెస్, ప్యాట్రిక్‌ ఇన్ఫో సర్వీసెస్, ఐటీ స్మిత్‌ సొల్యూషన్స్, ప్రొవెస్ట్‌మెంట్‌ సర్వీసెస్, భారతీయ గ్లోబల్‌ ఇన్ఫో మీడియా అనే షెల్‌ కంపెనీలను ఆ ప్రాజెక్టులో భాగస్వాములుగా చూపిస్తూ కథ నడిపించారు. ఒప్పందం ప్రకారం సీమెన్స్‌–డిజైన్‌టెక్‌ కంపెనీలు పెట్టుబడి పెట్టాల్సిన 90 శాతం నిధుల్లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండానే... ప్రభుత్వ వాటా 10 శాతం కింద రూ.370 కోట్లను డిజైన్‌టెక్‌కు టీడీపీ సర్కారు చెల్లించింది.

ఏపీఎస్‌ఎస్‌డీసీలో కీలక స్థానాల్లో ఉన్న చంద్రబాబు సన్నిహితులు కె.లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, అపర్ణ ఛటోపాధ్యాయ అందుకు సహకరించారు. అనంతరం వికాస్‌ కన్వేల్కర్, ముకుల్‌ అగర్వాల్, సు­రేశ్‌ గోయల్‌ సహకారంతో సుమన్‌ బోస్‌ రూ.241 కోట్లను సింగపూర్‌లోని ఓ బ్యాంకు ఖా­తాకు బదిలీ చేశారు. అవి హవాలా మార్గంలో రా­ష్ట్రంలోని టీడీపీ పెద్దలకు చేరినట్లు ఈడీ భావిస్తోంది. అందుకే నిందితులు నలుగురినీ మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. తద్వారా ఈ కేసును కొలిక్కితెచ్చి.. తదుపరి అరెస్టులు చేయాలని భావిస్తోంది.   

కస్టడీ కోరిన ఈడీ 
చంద్రబాబు కనుసన్నల్లో సాగిన స్కిల్‌ కుంభకోణంలో నలుగురు షెల్‌ కంపెనీల ప్రతినిధులను ఈ నెల 4న ఈడీ అరెస్టు చేసి విశాఖలోని పీఎంఎల్‌ఏ న్యాయస్థానంలో హాజరు పరచడం తెలిసిందే. సౌమ్యాద్రి శేఖర్‌బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ ఇండియా మాజీ ఎండీ)తో పాటు వికాస్‌ కన్విల్కర్‌ (డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌ చంద్ర అగర్వాల్‌ (పీవీఎస్పీ ఐటీ స్కిల్స్‌ సీఈవో), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌) నలుగురూ విచారణకు ఏమాత్రం సహకరించలేదని, క్షుణ్నంగా ప్రశ్నించేందుకు కస్టడీకి అప్పగించాలని శుక్రవారం ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్‌ వేశారు. వీరిని విచారించాక ఈ కేసులో కీలక సూత్రధారులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top