
సాక్షి, అమరావతి: షెడ్యూల్డ్ కులాల (ఎస్‌సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారితే, ఆ రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద రక్షణలు పొందలేరని తెలిపింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ,ఎస్టీ నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయలేరని, ఒకవేళ ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినా, అది చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కొందరిపై ఫిర్యాదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని సదరు పాస్టర్ దుర్వినియోగం చేశారని స్పష్టం చేసింది. ఆనంద్ క్రైస్తవ మతంలోకి మారి గత పదేళ్లుగా పాస్టర్‌గా కొనసాగుతున్నట్లు సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారని, ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయపడింది. క్రైస్తవ మతంలో కులమన్నది లేదని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో ఆనంద్ ఎస్‌సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ కోరలేరని తేల్చి చెప్పింది.
కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయలేదన్న కారణంతో క్రైస్తవంలోకి మారిన వ్యక్తి ఎస్సీ,ఎస్టీ చట్టం కింద రక్షణ కోరజాలరని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం తీర్పు వెలువరించారు. నిందితులపై గుంటూరు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టివేశారు.
నేపథ్యం ఇదీ...
తనను అక్కాల రామిరెడ్డి, మరికొందరు కులం పేరుతో దూషించారని, వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేయాలంటూ గుంటూరు జిల్లా, పిట్లవానిపాలెం మండలం, కొత్తపాలెంనకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరిలో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రామిరెడ్డి మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ రామిరెడ్డి తదితరులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు.