అబద్ధాలు నమ్మకండి: పవన్‌కు సంచయిత హితవు

Sanchaita Gajapathi Raju Tweet Over Pawan Kalyan Comments MANSAS Trust - Sakshi

సాక్షి, అమరావతి: తనను హిందూయేతర వ్యక్తిగా చిత్రీకరించే ప్రచారాలను నమ్మవద్దంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు హితవు పలికారు. తన తల్లిదండ్రులు హిందువులని, తాను కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు. సింహాచలం దేవస్థానం, మన్సాస్‌ ట్రస్టు విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు బయటకు తీస్తున్నందునే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాబట్టి తన గురించి చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని పవన్‌కు సూచించారు. మరో ప్రకటన విడుదల చేయడమో లేదా తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమో చేయాలన్నారు. హుందాతనం ఉన్న వ్యక్తిగా పవన్‌ నుంచి ఇదే ఆశిస్తున్నా అంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. (చదవండి: సంచయిత‌పై కేంద్రం ప్ర‌శంస‌లు)

ఈ మేరకు.. ‘పవన్‌కల్యాణ్‌ గారు.. మీ ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్‌ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందన్నారు. అందుకే నిజాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజుల పెద్ద కుమార్తెను. ఇద్దరూ హిందువులే. మా అమ్మగారు పునర్వివాహం చేసుకున్న రమేశ్ శర్మగారు హిందు పురోహిత కుటుంబం నుంచి వచ్చారు. ఆయన 6 సార్లు జాతీయ అవార్డు పొంది, ఒకసారి ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫిల్మ్ మేకర్. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను దయచేసి నమ్మకండి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం విషయంలో వారు చేసిన అవకతవకలు, అక్రమాలు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడతాయని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. (చదవండి: మా కుటుంబం జోలికి రావొద్దు: సంచయిత)

మీలాగే నేను కూడా ఒక హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తాను. మీ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ మరో ప్రకటన చేయాలని కోరుతున్నాను. చంద్రబాబునాయుడు గారు, ఆయన అనుచర వర్గం చేస్తున్న అవాస్తవ ప్రచారానికి, కట్టుకథలకు మీ ప్రకటన ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను. హుందాతనం కలిగిన వ్యక్తిగా మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నాను’ అంటూ ట్విటర్‌ వేదికగా టీడీపీ, చంద్రబాబు తీరును ఎండగడుతూనే పవన్‌ కల్యాణ్‌కు సైతం దుష్ప్రచారాలు నమ్మవద్దంటూ సంచయిత హితవు పలికారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్‌, టీడీపీతో బంధాన్ని వదులుకోలేకపోతున్నారని, అందుకే కాషాయ పార్టీకి చెందిన మహిళ గురించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలకు ఆయన వంతపాడుతున్నారంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top