ఉమ్మారెడ్డి మాకు స్ఫూర్తిదాయకం: సజ్జల

Sajjala Ramakrishna Reddy Applauds Ummareddy Venkateswarlu - Sakshi

ఉమ్మారెడ్డి వెంకయ్య-కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన నామకరణ మహోత్సవం

పాల్గొన్న సజ్జల, మంత్రులు పెద్దిరెడ్డి, ఆదిమూలపు సురేష్

సాక్షి, గుంటూరు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రమశిక్షణ గల వ్యక్తి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. తమకు ఆయన ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు -నేడు కార్యక్రమం ఒక యజ్ఞంలా జరుగుతోందని, ఈ పథకం వల్ల సర్కారీ బడులు, కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. మండలి చీఫ్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తన సొంత నిధులతో అభివృద్ధి చేసిన బాపట్ల మండలం కొండు భొట్లపాలెంలో ఉమ్మారెడ్డి వెంకయ్య-కోటమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన నామకరణ మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఉప సభాపతి కోన రఘపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, శ్రీ రంగనాథరాజు, ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదనరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విద్య, వైద్య రంగం పైన ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. పేదరికంతో పిల్లలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. తద్వారా 43 లక్షల మంది తల్లులకు సీఎం జగన్‌ అన్నయ్య అయ్యారంటూ సంతోషం వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. విద్యార్థినీ, విద్యార్థులకు ఇచ్చిన బెల్టు, బూట్లు ముఖ్యమంత్రే స్వయంగా సెలక్ట్ చేశారంటే విద్యార్థుల పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం జగన్‌ విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వచ్చే పదేళ్లలో రాష్ట్ర కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్తారని ఆయన విశ్వసిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

ఇంటి పెద్దగా ఆలోచిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి
‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించాలని అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఓ ఇంటి పెద్దగా పిల్లల గురించి ఆలోచన చేస్తున్నారు. నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన అంటే మాకు అత్యంత గౌరవం. ఆయన తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకం’’అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇంగ్లీష్‌ మీడియంపై రాద్దాంతం చేస్తున్న టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన ఆయన, ధనిక వర్గాల పిల్లలే ఇంగ్లీష్ మీడియం చదవాలా.... పేద వర్గాల ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని ప్రశ్నించారు.

అందుకే విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారు: ఆదిమూలపు సురేష్‌
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ’ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలను మార్చేస్తున్నారు. కొండు బొట్లపాలెం లోని జిల్లా పరిషత్ స్కూల్‌ను తన సొంత నిధులతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అభివృద్ధి చేశారు. సమాజంలో అసమానతలు పోగొట్టాలంటే విద్యే ఏకైక ఆయుధం. అందుకే సీఎం జగన్‌  విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో స్కూళ్ల మెయింటెనెన్స్ కోసం మాత్రమే నిధులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు మా ప్రభుత్వం విద్యాశాఖలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది’’అని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top