నా కొడుకు క్రిమినలా | Sai Krishna attends magisterial inquiry at Vijayawada Sub Collectorate | Sakshi
Sakshi News home page

నా కొడుకు క్రిమినలా

Jul 5 2026 5:21 AM | Updated on Jul 5 2026 5:21 AM

Sai Krishna attends magisterial inquiry at Vijayawada Sub Collectorate

నా కొడుకు బూడిదైనా ఇవ్వండంటూ మీడియా ఎదుట విలపిస్తున్న విజయలక్ష్మి

మీ వెనకాలే తిరిగాడు కదా? 

కాపులం ఓట్లు వేసి గెలిపించుకుంటే నిందలేస్తారా? 

కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి.. ఇప్పటికైనా నా కొడుకు బూడిద ఇవ్వండయ్యా  

లేదంటే రోడ్డుపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని చచ్చిపోతా 

నా కొడుకును చంపేశారు.. ఇప్పుడు మమ్మల్నీ చంపాలని చూస్తున్నారు  

సాయికృష్ణను తీసుకెళ్లిన వాళ్లను ఇంకా ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? 

తీసుకురమ్మని చెప్పిన వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 

నా కొడుకు చేతులపై మేకులు కొట్టి చంపేయాల్సినంత అవసరం ఏమిటి? 

పోలీసులు వీటికి కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే   

విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌లో మెజిస్టీరియల్‌ విచారణకు హాజరైన బాధితురాలు

సాక్షి, విజయవాడ: ‘కాపులం ఓట్లు వేసి నిన్ను గెలి­పించుకున్నాం.. నా కొడుకు మీకు (పవన్‌ కళ్యాణ్‌) ఫ్యానే (అభిమాని)గా.. మీ వెంటే తిరిగాడుగా.. అందుకనే మాకు ఇలా చేస్తున్నారా? నా కొడుకును క్రిమినల్‌ అని ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. సీఐ నాగరాజు కంటే నా కొడుకేమీ పెద్ద క్రిమినల్‌ కాదు. పోనీలే న్యాయం, నిజం నిదానంగా తెలు­స్తాయి. సచ్చి ఎక్కడో ఉన్నోడి మీద నిందలేస్తారా? ఇంత వరకు నాకు నా పిల్లోడి బూడిద ఇవ్వలేదు. అక్కడా.. ఇక్కడా తిప్పుతున్నారు. అందరూ కలిసి మాయ చేస్తున్నారు. 

నా కొడుకు బూడిద ఇస్తే నేను కర్మ కార్యక్రమాలు చేసుకుంటానయ్యా.. నేను బతకలేక పోతున్నానయ్యా.. నా కొడుకు రోజూ నా ముఖం చూసి వెళ్లేవాడు. గుర్తుకు వస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా..’ అని ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌ డెత్‌కు గురైన కాపు యువకుడు గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. శనివారం విజయవాడ సబ్‌ కలెక్టరేట్‌లో జరిగిన మెజిస్టీరియల్‌ విచారణకు ఆమె హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘నాకు వీళ్ల ఆస్తులు, పొలాలు, బంగారం ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. రెండు నెలలైంది. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చకే సీఐ నాగరాజు నా కొడుకు బతికుండగానే పడుకోబెట్టి చేతులపై మేకులు కొట్టి, లాఠీలతో కొట్టి.. అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడు? ఇంతకు ముందు ఇంకెంత మందిని ఇలా చంపారో? ఆఖరికి మమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎంత మందిని చంపుతారు? ఎంత మందిని దహనం చేస్తారు? సీఐ నాగరాజే పెద్ద క్రిమినల్‌. ఈ నిజాలన్నీ బయటకు రావాలి. నా కొడుకును చంపిన కేసులో ఉన్న అందరూ బయటకు రావాలి.

ఇంతవరకు నలుగురినో, ఐదుగురినో అరెస్ట్‌ చేశారు. మిగతా వాళ్లేరీ? ఆ రోజు నా కొడుకును తీసుకెళ్లడానికి వచ్చినోళ్లు ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. వాళ్లను ఎందుకు అరెస్ట్‌ చేయలేదు? అంతకంటే ముందు నా బిడ్డని తీసుకురమ్మన్నోళ్ల మీద ఎందుకు సరైన యాక్షన్‌ తీసుకోవట్లేదు? నేను ఏమీ చేయలేని అసమర్థురాలిని. ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఎవరిని న్యాయం అడగగలనయ్యా.. నేను మీ అందరినీ ఒకటే అడుగుతున్నా.. నా కొడుకు బూడిద ఇవ్వండి. దండం పెట్టి అడుగుతున్నా.. లేదంటే రోడ్డు మీద పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుని చచ్చిపోతా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  

మీ వెంటే తిరిగాడు కదా..  
‘నేను చెప్పకూడదు. వాళ్ల విషయం ఎత్తకూడదు. నీకు (డెప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌) నా కొడుకు ఫ్యాన్‌. మీ వెనకాలే నా కొడుకు తిరిగినట్లు ఎవరూ ఏనాడూ తిరగలే. చచ్చిపోయి ఎక్కడో ఉన్నోడి మీద నిందలేస్తున్నారు. ఏం జరిగిందో ఆ అమ్మాయి కూడా చెప్పిందిగా మొన్న. రేప్‌ చేస్తే కోర్టులు ఊరికే ఉంటాయా? నా కొడుకును క్రిమినల్‌ అని ఇంకా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడో బతికేవాడిని తీసుకొచ్చి ఇలా చంపేశారని బాధతో మాట్లాడుతున్నా. ఇప్పటికైనా దయచేసి నాకు ఇంత బూడిద ఇప్పించండి.. నేను కార్యక్రమం చేసుకుంటా’ అని విజయలక్ష్మి విలపించారు. 

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌పైన దొరికిన ఎముకలు, బూడిద తన కొడుకువే అని గ్యారెంటీ ఏంటని ఆమె ప్రశ్నించారు. ‘సాయికృష్ణను ఈ రకంగా చంపేశారంటే.. దేనికి ఆశపడి చేశారు? పోలీసులు కూడా అన్నమేగా తినేది? ఇలా ఎంత మందిని కనపడకుండా చేశారు?’ అని ఆమె ప్రశ్నించారు. ‘నా కొడుకు సాయికృష్ణను తెచ్చిన వాళ్లు, చంపిన వాళ్లలో ప్రతి ఒక్కరూ నాకు తెలుసు. అయితే నేను ఇప్పుడు అరెస్ట్‌ చేసినవాళ్లను చూసే పరిస్థితిలో లేను. మాట్లాడలేకపోతున్నా.. మీరే చూస్తున్నారుగా చేతులు వణికిపోతున్నాయి. 

అయ్యా.. నా కొడుకును ఒకసారి చూపించండి అని కృష్ణలంక స్టేషన్‌కు వెళ్లి అడిగితే.. ‘మా సీఐ ఊరుకోవట్లేదు. నువ్వు వెళ్లిపోవమ్మా ముందు’ అని బయటికి తోసింది ఎవరు? నా కొడుకు ఉంటే ఒక్కసారి ఫోన్‌ చేయించండయ్యా.. ఒకసారి చూపించండయ్యా.. అని ఎంతగా ఏడ్చాను? ఎంతగా బతిమిలాడాను? అయినా కనికరించలేదు. నా కొడుకు ఏం చేశాడని అంతలా చేతులపై మేకులు కొట్టి చంపేశారు? పోలీసులు కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిందే’ అని ఆమె డిమాండ్‌ చేశారు. మెజిస్ట్రేట్‌ విచారణ ఏమైంది అని అడగ్గా.. మళ్లీ పిలుస్తామని చెప్పారన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement