రైట్‌ రైట్‌.. రైతు బజార్

RTC Buses To Turn As Mobile Rythu Bazars In AP - Sakshi

మొబైల్‌ రైతు బజార్లుగా ఆర్టీసీ బస్సులు 

‘వైఎస్సార్‌ జనతా బజార్లు’గా నామకరణం 

సాక్షి, అమరావతి: ఆర్టీసీలో కిలోమీటర్లు పూర్తయిన బస్సులను మొబైల్‌ రైతు బజార్లుగా మార్చి నేరుగా గ్రామాలు, పట్టణాల్లో వినియోగదారుల వద్దకే కూరగాయలు, ఇతర నిత్యావసరాలు తీసుకెళ్లనున్నారు. వీటికి ‘వైఎస్సార్‌ జనతా బజార్లు’గా నామకరణంచేయనున్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 52 బస్సులను సంచార రైతు బజార్లుగా మార్చనున్నారు. వీటిని ఆర్టీసీలో ఇంజనీరింగ్‌ అధికారులు రూపొందించనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ మొబైల్‌ రైతు బజార్లను నగరాలు, పట్టణాల్లో తిప్పింది. ఈ ప్రయోగానికి వినియోగదారుల నుంచి స్పందన రావడంతో ఆర్టీసీ మార్క్‌ఫెడ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాన్‌ టిక్కెట్‌ రెవెన్యూ కింద ఆర్టీసీ ఆదాయం ఆర్జించేందుకు ఉపకరించడంతో ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖకు సంజీవని బస్సులు, మార్క్‌ఫెడ్‌కు మొబైల్‌ రైతు బజార్లు బస్సులను తిప్పేందుకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. లాక్‌డౌన్‌లో రూ.కోట్ల ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది.  

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా... 
► స్క్రాప్‌ కింద ఆర్టీసీ బస్సులను తీసేయకుండా నో కాస్ట్‌.. నో ప్రాఫిట్‌ విధానంలో కార్గో బస్సులుగా, మొబైల్‌ రైతు బజార్లుగా ఇంజనీరింగ్‌ అధికారులు మార్చారు. 
► కరోనా వ్యాప్తి రైతు బజార్లలో, మార్కెట్లలో ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను మొబైల్‌ రైతు బజార్లుగా మార్చి వినియోగదారుల వద్దకే సరుకులు తీసుకెళ్లనున్నారు. తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌ ఉదంతంతో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు ఈ తరహా ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.  
► లాక్‌డౌన్‌ సమయంలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో మొబైల్‌ బస్సులను తిప్పడంతో ఆదరణ లభించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top