రూ.1,071.84 కోట్ల ట్రూడౌన్‌ | Revenue for DISCOM form Electricity Tariffs | Sakshi
Sakshi News home page

రూ.1,071.84 కోట్ల ట్రూడౌన్‌

May 8 2026 5:32 AM | Updated on May 8 2026 5:32 AM

Revenue for DISCOM form Electricity Tariffs

వినియోగదారులకు ప్రయోజనం శూన్యం.. 

విద్యుత్‌ టారిఫ్‌ ద్వారా డిస్కంలకు ఆదాయం

సాక్షి, అమరావతి: విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రూ.1,071.84 కోట్ల ఆదాయం రాగా.. అందులో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ (ఏపీ ట్రాన్స్‌కో)కు రూ.1,071.84 కోట్ల మిగులు వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తేల్చింది. ట్రాన్స్‌కో తొలుత రూ.931.11 కోట్ల ట్రూడౌన్‌ను మాత్రమే ప్రతిపాదించగా, కమిషన్‌ సమగ్ర పరిశీలన అనంతరం ఆ మొత్తాన్ని పెంచింది. 2024–25 ఆరి్థక సంవత్సరానికి సంబంధించిన వ్యాపార పనితీరు సమీక్ష, ట్రూడౌన్‌పై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏపీఈఆర్‌సీ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కమిషన్‌ ఆమోదించిన మొత్తం వ్యయం రూ.3,370.­26 కోట్లు కాగా, వాస్తవ ఖర్చు రూ.2,801.96 కోట్లకే పరిమితమైంది. మరోవైపు ట్రాన్స్‌కోకు మొత్తం ఆదాయం రూ.3,873.80 కోట్లుగా నమోదైంది. ఆ విధంగా ఏర్పడిన మిగులు రూ.503.54 కోట్లకు తోడు ఇతర టారిఫ్, నాన్‌ టారిఫ్‌ ఆదాయాలు, అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలు వంటివి కలిపి మొత్తంగా రూ.1,071.84 కోట్ల మిగులు ఉన్నట్లు కమిషన్‌ పేర్కొంది. ఈ ట్రూడౌన్‌ మొత్తంలో ఇప్పటికే రూ.892.09 కోట్లు డిస్కంల ట్రాన్స్‌మిషన్‌ చార్జీలకు సర్దుబాటు చేసినట్లు తెలిపింది. మిగిలిన రూ.179.75 కోట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థలకు వాటి విద్యుత్‌ వినియోగ నిష్పత్తి ప్రకారం చెల్లించాలని ఏపీ ట్రాన్స్‌కోను ఆదేశించింది.

పూర్తికాని ప్రాజెక్టులు
2024–25 సంవత్సరానికి రిసోర్స్‌ ప్లాన్‌లో రూ.2,665.72 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించగా, వాస్తవంగా రూ.1,005.11 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఏపీ ట్రాన్స్‌కో పిటిషన్‌లో వెల్లడైంది. అనేక సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల పనులు ఇంకా పూర్తి కాలేదని ప్రజాభిప్రాయ సేకరణలో తెలిసినట్లు ఏపీఈఆర్‌సీ తెలిపింది. ప్రాజెక్టుల ఆలస్యానికి భూసేకరణ సమస్యలు, రైట్‌ ఆఫ్‌ వే ఇబ్బందులు, తుపాన్లు, కోర్టు కేసులు, ట్రాన్స్‌ఫార్మర్‌ సరఫరా ఆలస్యం వంటి కారణాలను ఏపీ ట్రాన్స్‌కో తన వివరణలో తెలిపినట్లు చెప్పింది. ట్రాన్స్‌మిషన్‌ నష్టాలు 2.6 శాతానికి తగ్గినట్లు కమిషన్‌ వెల్లడించింది. ట్రూడౌన్‌ ద్వారా వచ్చిన లాభాన్ని నేరుగా వినియోగదారుల బిల్లుల్లో చూపాల్సిన అవసరం లేదని కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని ఇప్పటికే 2026–27 విద్యుత్‌ టారిఫ్‌ లెక్కల్లో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement