ఆనందయ్య ఐ డ్రాప్స్‌తో కళ్లకు హాని 

Report says Anandaiahs Eye Drops Harmful: Govt To High Court  - Sakshi

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

పరీక్షల్లో ఈ విషయం బయటపడినట్లు వెల్లడి

నివేదికలను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశం  

సాక్షి, అమరావతి: ఆనందయ్య ఐ డ్రాప్స్‌ (కంటి మందు)లో హానికర పదార్థాలున్నట్లు పరీక్షల్లో తేలిందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది. దీని వినియోగం వల్ల కళ్లకు హాని కలుగుతుందంటూ నివేదికలు వచ్చాయని వివరించింది. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఆ పరీక్షలకు సంబంధించిన నివేదికలను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. వివరాలు.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బి.ఆనందయ్య కరోనా చికిత్సకు నాలుగు రకాల మందులు, ఐ డ్రాప్స్‌ తయారు చేశారు. ఈ మందుల వినియోగానికి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్యతో పాటు మరికొందరు గతంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఐ డ్రాప్స్‌ మినహా మిగిలిన 4 రకాల మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పరీక్షల్లో తేలడంతో.. ప్రభుత్వం వాటి వినియోగానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఐ డ్రాప్స్‌పై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ప్రముఖ సంస్థల నివేదికల ఆధారంగానే.. 
ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ, ఐ డ్రాప్స్‌ శాంపిళ్లను ఐదు సంస్థలకు పంపించామని చెప్పారు. కంటి చికిత్స రంగంలో ఎంతో పేరున్న ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్, శంకర నేత్రాలయ సంస్థలు నివేదికలిచ్చాయని తెలిపారు. ఆనందయ్య ఐ డ్రాప్స్‌లో హానికర పదార్థాలున్నట్లు ఆ నివేదికల్లో పేర్కొన్నాయని వెల్లడించారు. వాటి వినియోగం వల్ల కళ్లకు ప్రమాదం కలుగుతుందని చెప్పాయన్నారు. ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ జోక్యం చేసుకుంటూ.. ఐ డ్రాప్స్‌ వల్ల దుష్ప్రభావాలు ఉండవని తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ చెప్పిందన్నారు. ఈ మందు వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని హామీ కూడా ఇస్తామన్నారు. ముందు ఐ డ్రాప్స్‌ విషయంలో ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. పరీక్ష ఫలితాల నివేదికలను కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top