
పెద్దల కోసం.. పేదల భూములు
నాలా చట్టం రద్దుతో వ్యవసాయం, ఆహార భద్రతకు తీవ్ర ముప్పు
వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో తిండి గింజలకు కటకటలాడాల్సిన దుస్థితి
జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతకు తీవ్ర విఘాతం..
అభివృద్ధి ముసుగులో రియల్ ఎస్టేట్, పెద్ద వ్యాపారవేత్తలకు వ్యవసాయాన్ని బలి ఇస్తున్న చంద్రబాబు సర్కారు
పచ్చని భూములను దశాబ్దాల పాటు కాపాడిన నాలా చట్టం
సాక్షి, అమరావతి: వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో.. వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించేలా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల వ్యవసాయ భూములను కాపాడాల్సిందిపోయి వాటిని ప్రైవేట్ వ్యక్తులు, రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా ఆయన కంకణం కట్టుకుని పని చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందులో భాగంగానే ‘నాలా’ (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్) చట్టం రద్దుకు గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది.
ఇప్పటికే యాజమాన్య హక్కులు దక్కిన 13.59 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ భూములను ఫ్రీజ్ చేసిన చంద్రబాబు సర్కారు ఆ రైతులను రోడ్డున పడేసింది. తాజాగా ‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను రియల్ వ్యాపారులు, తమ అనుంగు పారిశ్రామికవేత్తలకు సులభంగా దక్కేలా చేసేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. దశాబ్దాలుగా ‘నాలా’ చట్టం రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయ రంగానికి రక్షణగా నిలిచింది. అలాంటి దాన్ని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించడం పట్ల తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి ఈ చట్టం అడ్డుగా ఉందనే సాకుతో దీన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతుండటాన్ని వ్యవసాయ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు.
ఇక సాగు భూములకు రక్షణ ఏది?
నాలా చట్టం మనుగడలో లేకపోతే వ్యవసాయ భూములను అత్యంత సులభంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య అవసరాలు, పరిశ్రమలకు అప్పగించేందుకు మార్గం సుగమం అవుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2006లో ‘నాలా’ చట్టాన్ని తెచ్చారు. వ్యవసాయ భూములను ఇష్టానుసారంగా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా నియంత్రించేందుకే ఈ చట్టాన్ని రూపొందించారు.
భూ వినియోగ మార్పిడి చేసుకుంటే ప్రస్తుతం ఆ భూమి విలువపై 5 శాతం పన్ను కట్టాలి. అలాగే కొన్ని ఇతర పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల తాము సులభంగా భూములు పొందలేకపోతున్నామంటూ రియల్ ఎస్టేట్, వ్యాపార సంస్థలు, పరిశ్రమల యాజమాన్యాలు చెబుతూ వస్తున్నాయి. నాలా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతున్నాయి. నిజానికి అడ్డగోలుగా జరిగే భూ వినియోగ మార్పిడిని ఈ చట్టం సమర్థంగా అడ్డుకుంది. రియల్ ఎస్టేట్ దందాలను కొంతమేరనైనా అడ్డుకోవడం వల్లే ఇప్పుడున్న సాగు భూమి మిగిలి ఉందని వ్యవసాయ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆహార భద్రతకు ముప్పు..
నాలా చట్టం అమలులో లేకుంటే వ్యవసాయ భూములు యథేచ్చగా రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయి తిండి గింజలకు కొరత ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నాయి. భూ మార్పిడిపై నియంత్రణ కరువవడంతో అటవీ ప్రాంతాలు, నీటి వనరులు, వ్యవసాయ యోగ్యమైన భూములు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొంటున్నాయి.
దీర్ఘకాలంలో ఇది పర్యావరణ సమతుల్యతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాలా చట్టం లేకుంటే భూ మార్పిడిపై ఎటువంటి నియంత్రణ లేనందున రియల్ ఎస్టేట్ సంస్థలు, బడా వ్యాపారవేత్తలు భూములను చౌకగా దక్కించుకుని రైతులను మోసం చేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది.
అన్నదాతల గురించి ఆలోచించరా?
రాష్ట్రంలో అభివృద్ధికి నాలా చట్టం అడ్డంకిగా ఉందని, దీన్ని రద్దు చేస్తేనే పెట్టుబడులు వస్తాయని చెబుతున్న చంద్రబాబు వ్యవసాయం, భూమినే నమ్ముకున్న అన్నదాతల మనోభావాలు, భావోద్వేగాల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం పెద్ద పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ లాబీలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనివల్ల సామాన్య రైతులకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు.
నాలా చట్టాన్ని రద్దు చేస్తే చిన్న, సన్నకారు రైతులు తమ భూములను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈవీఎస్ శర్మ ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. వ్యవసాయ భూములు తగ్గిపోవడం, ఆహార ధాన్యాల కొరత, ధరల పెరుగుదల, గ్రామీణ ఆరి్థక వ్యవస్థ కుంటుపడటం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
ప్రజా ప్రయోజనాలకు విఘాతం
‘నాలా’ రద్దుపై ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ శర్మ లేఖ
‘నాలా’ చట్టాన్ని రద్దు చేయడం వల్ల చిన్న రైతుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలుగుతుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు లేఖ రాశారు. రాష్ట్ర ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. ‘పరిశ్రమలు, ఇతర ప్రయోజనాల కోసం భూములు తీసుకునేందుకు ఆహార భద్రత లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయడం బాధాకరం. దీనివల్ల వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించే లక్షలాది మంది చిన్న రైతులు, సాంప్రదాయ మత్స్యకారులు, సహకార డెయిరీ సంస్థలపై ఆధారపడ్డ చిన్న పాల ఉత్పత్తిదారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.
ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలు సేకరిస్తూ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసింది. ప్రైవేట్ రంగ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం విధానాలను మార్చుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన లక్షలాది మంది నష్టపోతారు. ప్రభుత్వ విధానాలు అభివృద్ధికి దోహదం చేయాలి. అంతేగానీ ప్రైవేటు కంపెనీల లాభాలు పెంచడం కోసం కాదని గుర్తించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
రిలయన్స్‌కు కోరుకున్న చోట 5 లక్షల ఎకరాలు..
నాలా చట్టం రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తల కోసమే. ఈ చట్టం అమలులో ఉంటే భూములు అడ్డగోలుగా వారి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఎలా పడితే అలా భూములు తీసుకునే వీలుండదు. వారికి దొడ్డిదారిన మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నారు. రిలయన్స్ సంస్థకు 5 లక్షలు ఎకరాలు ఎక్కడ అడిగితే అక్కడ ఇవ్వాలని సీఎం ఏకంగా కలెక్టర్ల సమావేశంలోనే ఆదేశించారు. చాలా సంస్థలకు భూములివ్వడానికి రెడీ అయ్యారు. పెద్దవారికి భూములు ఇవ్వడానికి కావాల్సిన అన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నారు. – వై.కేశవరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు