AP: విద్యుత్‌ రంగంలో ‘వెలుగులు’

 Reduced Power Wastage With The Help Of Technology In AP - Sakshi

2014–15 నుంచి 2020–21 మధ్య 9.10 శాతానికి పెరిగిన డిస్కంల ఆదాయం

సాంకేతికత సాయంతో తగ్గిన విద్యుత్‌ వృథా.. పెరుగుతున్న ఆదాయం

సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. 32,244 మంది శాశ్వత ఉద్యోగులున్న అతిపెద్ద వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకుంటోంది. ఖర్చులు పెరుగుతున్నా, ఆదాయాన్ని కూడా పెంచుకుంటోంది. కొనుగోళ్లలో ఆదా చేస్తోంది. విద్యుత్‌ అంతరాయాలు, పంపిణీ నష్టాలు తగ్గించుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తూ, విద్యుత్‌ పొదుపు, వాతావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తోంది. జాతీయ, రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా పురోభివృద్ధి చెందుతోంది. సామాజిక ఆర్థిక సర్వే ఈ విషయాలను వెల్లడించింది.

పెరిగిన ఆదాయం, ఖర్చులు
2014–15 నుంచి 2020–21 కి మధ్య డిస్కంల ఆదాయం 7.95 శాతం నుంచి 9.10 శాతానికి పెరిగింది. అదే సమయంలో డిస్కంల ఖర్చులు రూ.24,211 కోట్ల నుంచి రూ.41,088 కోట్లకు పెరిగాయి. ఇందులో 65 శాతం విద్యుత్‌ కొనుగోళ్ల ఖర్చే. ఏటా కొనుగోళ్ల ఖర్చు రూ.8 వేల కోట్లు పెరుగుతోంది. ఈ ఏడేళ్లలో ఆర్థిక నష్టాలు రూ.9,026 కోట్ల నుంచి రూ.28,599 కోట్లకు చేరాయి. డిస్కంలకు అందిన ప్రభుత్వ సబ్సిటీలు రూ.2,525 కోట్ల నుంచి రూ.13,250 కోట్లకు చేరాయి. రాష్ట్ర విభజన అనంతరం సింగరేణి కాలరీస్‌ నుంచి బొగ్గు కొని థర్మల్‌ స్టేషన్లకు అందిస్తోంది. ఇందుకోసం ఏటా రూ.2500 కోట్లు సింగరేణి కాలరీస్‌కి చెల్లిస్తోంది. పునరుత్పాదక విద్యుత్‌కు ఏటా రూ.3 వేల కోట్లు వెచ్చిస్తోంది. సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్ల వినియోగానికి నెలకు మెగావాట్‌కు రూ.3.49 లక్షలు కడుతోంది.

కొత్త ప్రాజెక్టులు
రాష్ట్రంలో స్థాపిత విద్యుత్‌ సామర్ధ్యం 18,509.71 మెగావాట్లు కాగా దీనిలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 8,826.363 మెగావాట్లు. 4 గిగావాట్ల రివర్స్‌ పంప్డ్‌ హైడ్రో పవర్‌ సామర్ధ్యం కూడా ఉండటంతో 7 చోట్ల 29 స్థలాలను గుర్తించారు. ఈ ప్రదేశాల్లో ప్రాజెక్టులకు రూ.47.30 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. చిత్రకొండ డ్యామ్‌పై పవర్‌ ప్రాజెక్టుకు ఒడిశాతో 2020 అక్టోబర్‌ 23న ఒప్పందం కుదుర్చుకుంది. పోలవరంలో రూ.5,339 కోట్లతో నిర్మించే 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. 2024 జూలైకి 3 యూనిట్లు, 2026 కి మిగిలిన 9 యూనిట్లు ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోయర్‌ సీలేరులోనూ రూ.571 కోట్లతో 230 మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్టును మొదలుపెట్టారు. దీనిని రెండేళ్లలో పూర్తి చేయనున్నారు.

ఉచితం, సబ్సిడీలు
2018–19 నుంచి 2021–22 (నవంబర్‌ 2021) వరకూ 2,73,362 వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులను మంజూరు చేశారు. దీంతో ఈ సర్వీసుల సంఖ్య 19.24 లక్షలకు చేరింది. వీటన్నింటికీ ఉచితంగా 9 గంటలు పగటిపూట విద్యుత్‌ ఇస్తున్నారు. 25 ఏళ్ల పాటు దానిని కొనసాగించడానికి సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్‌ 2021వరకు) సబ్సిడీల కోసం రూ.6,801.14 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ఆక్వా సబ్సిడీకి రూ.477.55 కోట్లు, ఎస్సీ, ఎïస్టీలకు సబ్సిడీ విద్యుత్‌ కోసం రూ.214.79 కోట్లు విడుదల చేసింది. నర్సరీలు, చేనేత, మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్, బంగారం దుకాణాలకు 100 యూనిట్ల వరకు, దోభీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లు, రోల్డ్‌గోల్డ్‌ దుకాణాలకు 150 యూనిట్ల వరకూ సబ్సిడీ అందిస్తోంది.

ఇంధన సామర్థ్యంపై దృష్టి
రాష్ట్రంలో ఏటా 15 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా చేసే అవకాశం ఉందని ఇంధన శాఖ అంచనా వేసింది. దీనిని సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి ఇంధన పొదుపు, సామర్థ్యం పెంపు చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిపైనా దృష్టి సారించింది. 13,065 గ్రామ పంచాయతీల్లో 23.64 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఏటా రూ.156 కోట్ల విలువైన 260 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుంది. భవన నిర్మాణాల్లో విద్యుత్‌ పొదుపు చర్యలు తప్పనిసరి చేసింది. 32 వేల సోలార్‌ పంపుసెట్లను అందించింది.

తగ్గుతున్న నష్టాలు
ఆగ్రిగేట్‌ టెక్నికల్, కమర్షియల్‌ (ఏటీసీ) నష్టాలు 2018–19లో 16.36 శాతం ఉంటే 2019–20 నాటికి 13.36 శాతానికి తగ్గించుకొంది.  2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,752.50 కోట్లు సబ్సిడీలకు కేటాయిస్తూ మొత్తం రూ.6,103.50 కోట్లను  ప్రభుత్వం విడుదల చేసింది. సాంకేతికత ద్వారా ఖచ్చితమైన అంచనాలు వేస్తుండటంతో విద్యుత్‌ కొనుగోళ్లలో ఏటా కనీసం రూ.2 వేల కోట్లు ఆదా అవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top