
సాక్షి, అమరావతి: పట్టణాల్లో మార్చి నెలకు సంబంధించి ఇంటింటా రేషన్ సరుకుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల కోటా సరుకుల్ని ఈ నెల 3వ తేదీ వరకు పంపిణీ చేయాలని, మార్చి నెల కోటాను 4వ తేదీ నుంచి అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నూరు శాతం రేషన్ పంపిణీ పూర్తయిన గ్రామాల్లోని లబ్ధిదారులకు సోమవారం నుంచే సరుకుల్ని అందిస్తారు.
పేదలకు ప్రతి నెలా 1 నుంచి 15 వరకు రేషన్ సరుకుల్ని వారి ఇళ్లవద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఫిబ్రవరి నెల కోటాను పట్టణాల్లో 1వ తేదీ నుంచి పంపిణీ చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. రేషన్ పంపిణీ కోసం 9,260 మొబైల్ వాహనాలను వినియోగిస్తుండగా.. వాహనదారులకు మరింత ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా వారికిచ్చే మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు ప్రభుత్వం పెంచింది. వాహనం అద్దె నిమిత్తం రూ.13 వేలు, వాహన సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలు రూ.5 వేలు, పెట్రోల్ కోసం రూ.3 వేల చొప్పున పౌర సరఫరాల శాఖ ప్రతినెలా చెల్లించనుంది.