అరసవల్లిలో వైభవంగా రథసప్తమి

Rathasaptami in glory in Arasavalli and TTD Simhachalam Temples - Sakshi

అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్‌ ప్లాన్‌ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్‌జేసీ సురేష్‌బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం..
తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్‌ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. 

సింహగిరిపై విశేషంగా రథసప్తమి
సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top