కడపలో అరుదైన శాసనం లభ్యం

Rare Inscription Came to light in Kadapa District - Sakshi

సాక్షి, కడప : జిల్లాలో మరొక అరుదైన శాసనం వెలుగు చూసింది. ఈ ప్రాంతం రేనాటి రాజుల పాలనలో ఉండిందని దీని ద్వారా మరో మారు స్పష్టం అవుతోంది. జిల్లాలోని చిన్న దుద్యాల గ్రామంలో లభించిన దీని గురించి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు వెలుగులోకి తెచ్చారు. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  జిల్లాకు శాసనాల ఖిల్లాగా పేరుంది. రాష్ట్రంలో లభించిన మొత్తం తెలుగు శాసనాలలో ఎక్కువ శాతం వైఎస్‌ఆర్‌ జిల్లాలోనే లభించిన విషయం తెలిసిందే. ఇటీవల జిల్లాలో లభించిన ఓ శాసనం ద్వారా జిల్లా పాలనలో తమదైన ముద్ర వేసిన రేనాటి చోళులు మన జిల్లా వారేనని స్పష్టం అయింది. ఇప్పుడు లభించిన శాసనం ద్వారా అది మరో మారు ధృవీకరింపబడింది.  

జిల్లాలోని ముద్దనూరు మండలం చిన్న దుద్యాల గ్రామంలో గల శివనారాయణరెడ్డి పొలంలో ఇటీవల ఓ శాసనం బయల్పడింది. దాని విలువను గ్రహించిన ఆయన దాని గురించిన సమాచారాన్ని తన మిత్రుడు వైవీయూ పరిశోధక విద్యార్థి నిఖిల్‌కు తెలిపారు. ఆయన తన సహచర పరిశోధక మిత్రుడైన వాసుదేవ రెడ్డికి  శాసనం గురించి వివరించారు. వారిద్దరూ కలిసి వైవీయూ చరిత్ర పురావస్తు శాఖ ఆసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రామబ్రహ్మంకు సమాచారం అందించారు. ఆయన దాని గురించి పరిశీలించి భారత పురాతత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. 

శాసన పాఠం ఇలా..... 
శాసన లిపి పరిశోధకుల సమాచారం ప్రకారం చిన్న దుద్యాలలో  వెలుగు చూసిన ఈ శాసనంలోని సమాచారం ఇలా ఉంది. దీన్ని క్రీస్తుశకం 8వ శతాబ్దంలో నాటి ఈ ప్రాంత పాలకులు రేనాటి చోళులు వేయించినట్లు కేంద్ర పురావస్తు శాఖ పరిశోధకులు తెలుపుతున్నారు. రాతి బండకు ఇరువైపులా అక్షరాలు ఉన్నాయి. ఇవి నాటి తెలుగు లిపిలో ఉన్నట్లు సమాచారం. రేనాటి ప్రభువు చోళులు చిన్న దుద్యాల గ్రామంలోని ఓ దేవాలయానికి చెందిన అర్చకులకు ఆరుమరŠుత్యల భూమిని దానంగా ఇచ్చినట్లు ఇందులో రాసి ఉంది. జిల్లాలో పాలించిన ప్రభువులలో రేనాటి పాలకులు తమదైన ముద్ర వేశారు.  

జిల్లాలోని కల్లమల్లలో లభించిన తొలి తెలుగు శాసనం రేనాటి ధనుంజయుడు 575లో వేయించినట్టు తెలుస్తోంది. తెలుగు భాష ఉనికిని జిల్లాలో చాటి చెప్పిన అపురూపమైన శాసనంగా దీనికి దేశంలో ముఖ్యంగా తెలుగునాట ఎంతో ప్రాముఖ్యత లభిస్తోంది. దీని ద్వారా మన ప్రాంతంలో తెలుగు భాషకు పట్టం కట్టిన వైనంతో పాటు రేనాటి ప్రభువుల సంక్షేమ పాలన గురించి కూడ స్పష్టంగా తెలియవస్తోంది. ఇప్పుడు చిన్న దుద్యాలలో లభించిన శాసనం ద్వారా ఈ విషయం  మరోమారు స్పష్టం అవుతోంది.  దీనిని వెలుగులోకి తెచ్చిన వైవీయూ  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రామబ్రహ్మం,   పొలం యజమాని శివనారాయణరెడ్డి, పరిశోధక విద్యార్థులను చరిత్ర, పరిశోధక అభిమానులు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top