లండన్‌లో పూర్ణిమ దీప్తులు | Rare Award to Telugu Woman in Britain | Sakshi
Sakshi News home page

లండన్‌లో పూర్ణిమ దీప్తులు

Aug 3 2025 11:10 AM | Updated on Aug 3 2025 11:10 AM

Rare Award to Telugu Woman in Britain

 నాటి కొత్తపేట వనితకు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం 

అక్కడి రాజవంశంచే ప్రదానం 

 

డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ: దేశం కాని దేశం, అందులోనూ అత్యున్నత పురస్కారం పొందడమంటే మామూలు విషయం కాదు.. ఎంతో సేవ చేసి, అందరితో శభాష్‌ అనిపించుకోవాలి.. అచ్చం అలానే సేవల్లో గుర్తింపు తెచ్చుకుని లండన్‌లో బ్రిటన్‌ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారం తీసుకుని కోనసీమ జిల్లా ఆడపడుచు కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. బ్రిటన్‌ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నతమైన కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ అంపైర్‌ (సీబీఈ)ను కొత్తపేట ఆడపడుచు అయ్యగారి అన్నపూర్ణ (పూర్ణిమ తణుకు) దక్కించుకున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఐదేళ్ల లోపు పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నేషనల్‌ డే నర్సరీస్‌ అసోసియేషన్‌కు పూరి్ణమ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. విభిన్న రంగాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ తమ జీవితాన్ని అంకితం చేసిన వారికి బ్రిటిష్‌ రాజవంశం ఇచ్చే పౌర పురస్కారాల్లో అత్యున్నత సీబీఈ లభిస్తుంది. అటువంటి పురస్కారం ఇటీవల పూర్ణిమకు దక్కింది. 

కొత్తపేట నుంచే బాట 
కొత్తపేటలో ప్రస్తుతం పొట్టిశ్రీరాములు వీధిని ఒకప్పుడు సత్యవోలు రామమూర్తి వీధి అని పిలిచేవారు. ఆ సత్యవోలు రామమూర్తి మనుమరాలు, కొత్తపేట మాజీ సర్పంచ్‌ సత్యవోలు రామకృష్ణ మేనకోడలు అయ్యగారి అన్నపూర్ణ (పూరి్ణమ). ఆమె తండ్రి విశ్వేశ్వరయ్య అమలాపురంలో టైప్‌ ఇనిస్టిట్యూట్‌ నడిపేవారు. తల్లి రత్నాంబ గృహిణిగా ఉండేవారు. అన్నపూర్ణ కొత్తపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకున్నారు. 1960 దశకంలో కొత్తపేట పంచాయతీ సమితి నంబరు– 1 ప్రాథమిక పాఠశాల (వీరయ్యగారి బడి)లో ప్రాథమిక విద్య, 1963–68 వరకూ చింతం అమ్మాణమ్మ జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత పీయూసీ, డిగ్రీ అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కాలేజ్‌లో, పీజీ ఆంధ్రా యూనివర్సిటీలో చదివిన అయ్యగారి అన్నపూర్ణ అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ప్రతిభా పురస్కారాలను కైవసం చేసుకున్నారు. రిటైర్డ్‌ హెచ్‌ఎం, కొత్తపేట ప్రియదర్శినీ బాలవిహార్‌ వ్యవస్థాపకుడు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అద్దంకి కేశవరావు కుమార్తె స్వరాజ్యకుమారి వద్ద శాస్త్రీయ నృత్యం, గైడ్‌ స్టూడెంట్‌గా శిక్షణ పొందారు. లండన్‌లో సర్జన్‌ అయిన తణుకు వెంకట సూర్యనారాయణతో వివాహానంతరం ‘పూరి్ణమ తణుకు’గా కొత్త జీవితాన్ని ఆరంభించారు. 

విశేష కృషికి గుర్తింపుగా.. 
పూరి్ణమ తణుకు మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అందించే విద్యలో చేసిన విశేష కృషికి ఈ గుర్తింపు లభించింది. ఇంత వరకూ బ్రిటన్‌లో స్థిరపడి పౌరసత్వం పొందిన తెలుగు వారెవరికీ దక్కని గౌరవమిది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి కృషిని భిన్నస్థాయిల్లో అత్యంత నిశితంగా పరిశీలించి ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గత నెల 22న బ్రిటిష్‌ రాజవంశీకులుండే విండ్‌సార్‌ కేజిల్‌లో ఎంతో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌–2, ప్రిన్స్‌ ఫిలిప్‌ల కుమార్తె, ప్రస్తుత బ్రిటన్‌రాజు చార్లెస్‌ ఏకైక సోదరి అయిన ప్రిన్సెస్‌ ఆనీ ఈ పురస్కారాన్ని పూరి్ణమకు అందజేశారు. 

హేమాహేమీల çపక్కన.. 
ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్, బ్రిటన్‌ ఆధునిక నాటక రచయిత, దర్శకుడు, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన హెరాల్డ్‌ పింటర్, రగ్బీ ఆటగాడు జొనాథన్‌ పీటర్‌ విల్కిన్సన్‌ వంటి హేమాహేమీలు గతంలో ఈ పురస్కారం అందుకున్న ప్రముఖుల్లో కొందరు. ఇటీవలే ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్‌ సంస్థ ‘షెనెల్‌’కు సీఈఓగా ఉంటున్న లీనా నాయర్‌ కూడా సీబీఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా పూరి్ణమ అందుకుని ఆ ప్రముఖుల సరసన నిలిచారు. ఈ పురస్కారాన్ని పొందటంలో తన కుటుంబం ఎంతో తోడ్పడిందని, అలాగే మిత్రులు, తన బృంద సభ్యుల కృషి కూడా ఉందని పూర్ణిమ తెలిపారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపేట ఆడపడుచు, అక్కడ పూర్వ విద్యార్థిని అయిన పూరి్ణమకు బ్రిటన్‌ అత్యున్నత పురస్కారం పొందడం పట్ల ఈ గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.   

లండన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement