రెండుచోట్ల గెలవడం కొంప ముంచింది

Rare and interesting event in AP panchayat elections - Sakshi

పంచాయతీ ఎన్నికల్లో అరుదైన, ఆసక్తికర ఘటన

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులతో పోటీపడి రెండు చోట్ల గెలిచాడు. ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. కానీ.. చివరకు ఏ పదవీ ఆయనకు దక్కలేదు. అత్యంత అరుదైన, ఆసక్తికరమైన ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రులో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 9వ తేదీన చింతపర్రు సర్పంచ్‌ పదవితో పాటు గ్రామంలోని వార్డు పదవులకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అదే గ్రామానికి చెందిన పెనుమత్స వెంకట రామకృష్ణంరాజు 4, 5 వార్డుల్లో పోటీ చేశారు. రెండుచోట్లా ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరీ గెలిచారు. 4వ వార్డులో 243 మంది ఓటర్లు ఉండగా.. 212 ఓట్లు పోలయ్యాయి. మొత్తం నలుగురు అభ్యర్థులు రంగంలో ఉండగా రామకృష్ణంరాజు 44 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 5వ వార్డులోనూ 243 మంది ఓటర్లు ఉండగా.. 214 పోలయ్యాయి. ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. 38 ఓట్ల మెజార్టీతో రామకృష్ణంరాజే గెలిచారు. ఆ తర్వాత వార్డు సభ్యుల ద్వారా పరోక్ష పద్ధతిన జరిగే ఉప సర్పంచ్‌ ఎన్నికల్లోనూ రామకృష్ణంరాజు పోటీపడి ఉప సర్పంచ్‌గానూ గెలుపొందారు. కానీ.. చివరకు వార్డు పదవితోపాటు ఉప సర్పంచ్‌ పదవికి సైతం ఆయన దూరం కావాల్సి వచ్చింది.

ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడంతో..
పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక స్థానానికి మించి పోటీ చేయకూడదు. కానీ.. రామకృష్ణంరాజు మాత్రం రెండు వార్డుల్లో పోటీ చేయడమే కాకుండా రెండుచోట్లా గెలిచారు. నిబంధనల కారణంగా.. ఆయన రెండు వార్డు పదవులతో పాటు ఉప సర్పంచ్‌ పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికల నిబంధనావళి రూల్‌ నంబర్‌ 8(3)  ప్రకారం.. ఒక అభ్యర్థి ఒకచోట కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు దాఖలు చేసిన పక్షంలో నామినేషన్ల ఉపసంహరణ తేదీ నాటికి అందులో ఏదో ఒకచోట తప్ప మిగిలిన చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లన్నీ రద్దవుతాయి. ఈ నిబంధన విషయంలో పోటీ చేసిన అభ్యర్థితోపాటు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన ఉద్యోగికి సైతం అవగాహన లేకపోవడంతో రామకృష్ణంరాజుకు రెండుచోట్లా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

రామకృష్ణంరాజు నిబంధనల్ని ఉల్లంఘించి ఎన్నికల్లో గెలిచారంటూ అయనపై పోటీ చేసిన ప్రత్యర్ధులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ జరిపించిన ఎన్నికల కమిషన్‌ ఆ రెండు వార్డుల ఎన్నికలతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నికనూ రద్దు చేసింది. దీంతో ఆయన అన్ని పదవులనూ కోల్పోవాల్సి వచ్చింది. రిటర్నింగ్‌ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల ఈ పరిస్థితి ఎదురైనట్టు గుర్తించిన కలెక్టర్‌ స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన కె.శ్రీరామమూర్తిని సస్పెండ్‌ చేసినట్టు సమాచారం. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌  సమాచారం ఇచ్చారని తెలిసింది.  

ఆ రెండు వార్డుల ఎన్నికకు ప్రత్యేక నోటిఫికేషన్‌
చింతపర్రు గ్రామ పంచాయతీలో 4, 5 రెండు వార్డులతోపాటు ఉప సర్పంచ్‌ పదవికి తిరిగి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 13వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు వార్డు పదవులకు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 26వ తేదీన పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు ఉప సర్పంచ్‌ ఎన్నికను కూడా చేపడతారు. ఇలావుండగా, రామకృష్ణంరాజు రెండు వార్డుల్లోనూ తిరిగి నామినేషన్‌ వేశారు. ఏ వార్డు అనుకూలమో నిర్ణయించుకుని రెండోచోట నామినేషన్‌ ఉపసంహరించుకుంటానని ఆయన తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top