సంతృప్తికర స్థాయిలో వర్షాలు

Rains satisfactory level Andhra Pradesh Heavy rain forecast for Rayalaseema - Sakshi

జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు 9 అల్పపీడనాలు.. 2 వాయుగుండాలు.. ఒక తుపాను

నైరుతి రుతుపవనాల సీజన్‌లో 10 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో స్వల్ప లోటు

మొదలైన నైరుతి రుతుపవనాల నిష్క్రమణ 

సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షాలు కురిపించాయి. జూన్‌ ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో మూడు తీవ్ర అల్పపీడనాలుగా మారాయి. జూన్‌లో ఒకటి, జూలైలో మూడు, ఆగస్టులో రెండు, సెప్టెంబర్‌లో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. 

సెప్టెంబర్‌ చివరలో గులాబ్‌
సెప్టెంబర్‌లో ఏర్పడ్డ రెండు వాయుగుండాల్లో ఒకటి తీవ్ర వాయుగుండంగా బలపడింది. నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసే సమయంలో సెప్టెంబర్‌ చివరలో గులాబ్‌ తుపాను ఏర్పడింది. మొత్తంగా సెప్టెంబర్‌లోనే ఒక తుపాను, ఒక వాయుగుండం, ఒక తీవ్ర వాయుగుండం, రెండు తీవ్ర అల్పపీడనాలు, ఒక అల్పపీడనం ఏర్పడడం విశేషం. వీటన్నింటిలో గులాబ్‌ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వచ్చే తుపానులు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చే తుపానులు ఎక్కువగా మన రాష్ట్రంలో తీరం దాటుతాయి. గత కొన్నేళ్ల వాతావరణ విశ్లేషణలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను మన రాష్ట్రంలోని కళింగపట్నం దగ్గర తీరం దాటి తీవ్ర ప్రభావం చూపింది. 

విస్తారంగా వర్షాలు 
ఈ నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 514 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సివుండగా 613.3 మి.మీ వర్షం కురిసింది. 19 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. దీన్ని వాతావరణ శాఖ సాధారణ వర్షపాతంగానే (20 శాతం వ్యత్యాసం ఉంటే సాధారణమే) పరిగణిస్తుంది. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం కురవగా వైఎస్సార్‌ జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 37 శాతం, విజయనగరం జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 33 శాతం, తూర్పుగోదావరిలో 29 శాతం, కృష్ణాలో 28 శాతం అధిక వర్షాలు కురిశాయి.

అనంతపురం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటె కొంచెం తక్కువ వర్షం కురిసింది. స్వల్పంగా లోటు వర్షం కురిసినా అది పది శాతంలోపే కావడంతో సాధారణంగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 6 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది.  

రాయలసీమకు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 14న వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇది 15వ తేదీన తుపానుగా బలపడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చెబుతోంది. నిష్క్రమిస్తున్న నైరుతి రుతు పవనాలు క్రమంగా మన రాష్ట్రం వైపు వస్తుండటంతో వారం రోజుల పాటు వర్షాలు పుంజుకోనున్నాయి.

వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఆదివారం దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల, సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కె.బిట్రగుంటలో 90.25 మి.మీ., ప్రత్తిపాడులో 63.5, కిర్లంపూడిలో 62.7, గోరంట్లలో 60, జగ్గంపేటలో 59, పమిడిలో 57, పలగలపల్లిలో 52.5, పెద్దతిప్పసముద్రంలో 45, ఓబుళదేవర చెరువు, శంఖవరంలో 44.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వైఎస్సార్‌ జిల్లాను శనివారం వర్షం ముంచెత్తింది. కడప, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులైన పాపాగ్ని, మాండవ్య నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. వీరబల్లి మండలంలోని గడికోట వద్ద మాండవ్య నది దాటుతూ కాకినాడకు చెందిన గోవిందరావు (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top