గంజాయి కట్టడికి.. రైల్వే పోలీసులు సైతం.. 

Railway police force support to Cannabis Prevention - Sakshi

ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగస్వామ్యం 

25 ప్రత్యేక బృందాలతో రైల్వేస్టేషన్లలో విస్తృత తనిఖీలు

సాక్షి, అమరావతి: గంజాయి దందాపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’లో రైల్వే పోలీసులూ కీలకపాత్ర పోషిస్తున్నారు. రైళ్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు జనరల్‌ రైల్వే పోలీస్‌ (జీఆర్‌పీ), రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ)లో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌–ఎస్‌ఈబీ), పోలీసు అధికారులు విస్తృతంగా చేపట్టిన ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’ గంజాయి మాఫియాను హడలెత్తిస్తోంది. వందల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేస్తున్నారు. మరోవైపు..  ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో తనిఖీలుచేస్తూ గంజాయి నిల్వలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో.. ఉన్న గంజాయి నిల్వలను హడావుడిగా ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు గంజాయి ముఠాలు ప్రయత్నిస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రోడ్డు మార్గంలో అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. దీంతోపాటు రైళ్లలోనూ విస్తృతంగా తనిఖీలు చేయాలని జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.  

25 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు 
ఆపరేషన్‌ పరివర్తన్‌ కోసం జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ బలగాలతో 25 ప్రత్యేక బృందాలను నియమించారు. వాటిలో విజయవాడ రైల్వే పోలీస్‌ జిల్లా పరిధిలో 20 బృందాలు, గుంతకల్‌ రైల్వే పోలీస్‌ జిల్లా పరిధిలో 5 బృందాలను ఏర్పాటుచేశారు. విజయవాడ రైల్వే పోలీస్‌ జిల్లా పరిధిలోని 15 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్‌ పోస్టులు, గుంతకల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని 19 ప్రధాన రైల్వేస్టేషన్లు, 15 అవుట్‌ పోస్టులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పార్శిళ్లలో ఉన్న గంజాయిని గుర్తించేందుకు పోలీసు జాగిలాలను కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ‘ఆపరేషన్‌’ సంపూర్ణంగా విజయవంతమయ్యే వరకు రైళ్లలో తనిఖీలను కొనసాగిస్తామని అదనపు డీజీ (రైల్వే) హరీష్‌కుమార్‌ గుప్తా చెప్పారు.  

ఆపరేషన్‌లో ‘సెబ్‌’ కమిషనర్‌ 
మరోవైపు.. ‘ఆపరేషన్‌ పరివర్తన్‌’లో ‘సెబ్‌’ కమిషనర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ గురువారం స్వయంగా పాల్గొన్నారు. ముందస్తు సమచారం ఇవ్వకుండా ఆయన గురువారం విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం పంగళలంలోని సెబ్‌ బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్నారు. అక్కడ నుంచి ఏడు బృందాలతో కలిసి ఆయన పాడేరు, చింతపల్లి మండలాల్లోని మారుమూల తండాల్లో గంజాయి సాగు తీరును పరిశీలించి విస్తుపోయారు. దాదాపు 200 ఎకరాల్లో ఈ పంటలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో సెబ్‌ జేడీ సతీష్, సెబ్‌ స్పెషల్‌ యూనిట్‌ జేడీ నరేంద్రనాథ్‌ రెడ్డి, పాడేరు అదనపు ఎస్పీ జగదీశ్, సెబ్‌ సూపరింటెండెంట్‌ నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top