రబీ.. రయ్‌ రయ్

Rabi Cultivation Reached One Lakh Hectares In 15 days - Sakshi

15 రోజుల్లో లక్ష హెక్టార్లకు చేరిన సాగు 

సాక్షి, అమరావతి: రబీ సీజన్‌ ప్రారంభమై 15 రోజులు గడుస్తోంది. లక్ష హెక్టార్లకు పైగా విస్తీర్ణం ఇప్పటికే సాగులోకి వచ్చింది. రబీ అధికారికంగా అక్టోబర్‌ ఒకటిన మొదలైనా నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు, వరదలతో పంటలు వేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి, పునాస పంట కోతలు ప్రారంభం కాగా.. రైతులు రెండో పంట వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఓ వైపు ఖరీఫ్‌ పంటల్ని ఒబ్బిడి చేసుకుంటూనే.. మరోవైపు రబీ పంటకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో అత్యధికంగా సాగయ్యే వాటిలో వరి, శనగ, మినుము తదితర పంటలున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అందజేసిన రైతు భరోసా సాయంతో పాటు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందుబాటులోకి రావడంతో రైతులు కాడీ, మేడీ పట్టి ముందుకు సాగుతున్నారు. రబీలో సాగు విస్తీర్ణం 22.75 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 1.07 లక్షల హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. ఈ సీజన్‌కు అవసరమైన 15 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సబ్సిడీపై సరఫరా చేస్తోంది. 2,71,612 క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం సిద్ధం చేయగా.. ఇప్పటికే 69,389 మంది రైతులు ఆర్బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలను అందుకున్నారు. రబీకి అవసరమైన యూరియా సహా అన్నిరకాల ఎరువుల్ని అందుబాటులో ఉంచినట్టు వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. 

సాగులోకి వచ్చిన పంటల వివరాలివీ.. 
రబీలో వరి సాగు విస్తీర్ణం 7.12 లక్షల హెక్టార్లు కాగా.. ఇప్పటికే 24 వేల హెక్టార్లలో వేశారు. 11 వేల హెక్టార్లలో నూనె గింజలు, 32వేల హెక్టార్లలో శనగ, 4 వేల హెక్టార్లలో అపరాలు, మిగతా విస్తీర్ణంలో ఇతర పంటల్ని ఇప్పటికే విత్తారు. ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top