వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని.. | Proddatur Wife Shilpa Reddy Incident | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం భర్తకు తెలిసిందని..

Apr 24 2026 2:29 PM | Updated on Apr 24 2026 2:56 PM

Proddatur Wife Shilpa Reddy Incident

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న సుధీర్‌ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది.

ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుదీర్‌ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్‌ నవీన్‌ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది.

తన భర్త ఈశ్వర్‌రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో రూ.10 లక్షల సుపారీ కుదుర్చుకుంది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఇవ్వడంతో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్‌ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డులో ఈశ్వర్‌రెడ్డిని కారుతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్‌టౌన్‌ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్‌ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వ్యూహం బెడిసికొట్టడంతో నిందితులు.. పోలీసులకు చిక్కారు. భార్య శిల్పారెడ్డి, ప్రియుడు సుధీర్, రౌడీ షీటర్ వినయ్, హిందూపురం కిరాయి ముఠాతో పాటు 10 మందిని అరెస్టు చేశారు. నిందితుల వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ  విబూకృష్ణ పోలీసులు వెల్లడించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement