పేద మెరిట్‌ విద్యార్థులకు ప్రైవేటు వర్సిటీల్లో 35 శాతం సీట్లు

Private Universities: 35 Percent Convenor Quota Seats For Poor Merit Students - Sakshi

కన్వీనర్‌ కోటాలో భర్తీ చేసేలా ప్రభుత్వ చర్యలు

రాయితీ ఫీజులు కూడా వర్తింపు

ఈ మేరకు ప్రైవేటు యూనివర్సిటీల చట్టానికి సవరణలు

ఉత్తర్వులు జారీ

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలనానికి తెరతీసింది. ఇక రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోని వివిధ కోర్సుల్లో 35 శాతం సీట్లు నిరుపేద మెరిట్‌ విద్యార్థులకే కేటాయించనుంది. ఈ సీట్లను ప్రభుత్వ కోటా (కన్వీనర్‌ కోటా) కింద రాయితీ ఫీజులతో పేదలకు అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం–2017కు సవరణలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు ఆయా సంస్థల విధివిధానాల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలతోపాటు ప్రైవేటు వర్సిటీల్లోనూ పేదలకు సీట్లు దక్కనున్నాయి. 

‘ప్రైవేటు’కు మాత్రమే మేలు కలిగేలా టీడీపీ ప్రభుత్వం చట్టం
ప్రైవేటు వర్సిటీల చట్టాన్ని రూపొందించిన గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు మేలు జరిగేలా కాకుండా ఆ వర్సిటీలకు లాభం చేకూరేలా మాత్రమే చట్టంలో నిబంధనలు పెట్టింది. ఆ వర్సిటీలకు భూములను తక్కువ ధరకే ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ కల్పించింది. ప్రైవేటు వర్సిటీలకు ఇన్ని ప్రయోజనాలు అందిస్తూ కూడా రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చట్టాన్ని రూపొందించింది. ప్రవేశాలు, ఫీజుల నుంచి అన్ని వ్యవహారాల్లోనూ ఆ వర్సిటీల ఇష్టానుసారానికే వదిలిపెట్టింది. దీంతో ఆ వర్సిటీలు సీట్లను అత్యధిక ఫీజులు చెల్లించినవారికి మాత్రమే కేటాయిస్తున్నాయి.

ఫలితంగా పేద మెరిట్‌ విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీల్లోని 35 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సీట్లను ప్రవేశపరీక్షలో మెరిట్‌ సాధించిన రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రకారం కన్వీనర్‌ కోటాలో పారదర్శకంగా కేటాయించనున్నారు. 

ఫీజులపైనా నియంత్రణ
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీ నోటిఫికేషన్‌ మేరకు ప్రైవేటు వర్సిటీలు ఫీజుల నిర్ణయానికి అకౌంటు పుస్తకాలు, ఇతర పత్రాలను అథారిటీ సమర్పించాలి. ఈ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని పరిశీలించి అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. కోర్సుల వారీగా ఆ వర్సిటీలు నిర్ణయించిన ఫీజులను సమీక్షించి.. అంతిమంగా వాటి వాదనలను కూడా విని ఫీజులను నిర్ణయిస్తుంది. దీని సిఫార్సుల మేరకు ఆ ఫీజులను ప్రభుత్వం నోటిఫై చేస్తుంది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే విద్యా సంస్థలపై రూ.15 లక్షలకు మించకుండా పెనాల్టీని విధించే అధికారం అథారిటీకి ఉంటుంది. వర్సిటీలు తప్పనిసరిగా నిర్ణీత ప్రమాణాల్లో నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌), నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు కలిగి ఉండాలి. భవిష్యత్తులో రానున్న మూడేళ్లలో వివిధ కోర్సుల నిర్వహణకు రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టగలగాలి. అంతర్జాతీయ స్థాయిలో టాప్‌ 100 యూనివర్సిటీలతో జాయింట్‌ సర్టిఫికేషన్‌ డిగ్రీలకు వీలుగా టైఅప్‌ కలిగి ఉండాలని ప్రైవేటు వర్సిటీల చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top