బాబు పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పి.. 3లక్షలు కట్టాక శవాన్ని ఇచ్చారు

Private Hospital Children dead body 3 lakhs amount Visakhapatnam - Sakshi

సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): డబ్బులు తీసుకుని పసి పిల్లాడి శవాన్ని ఇచ్చారని ఆరోపిస్తూ బాధితులు శనివారం రాత్రి రామ్‌నగర్‌ ఒమ్ని ఆర్‌.కె.ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు మహారాజు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న తన రెండేళ్ల కుమారుడు ధాన్విక్‌ను గురువారం రాత్రి ఒమ్ని ఆర్‌.కె.ఆస్పత్రిలో చేర్పించారు.

గురువారం, శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. బాబుకు డయాలసిస్‌ చేయడంతోపాటు వెంటిలేటర్‌ మీద చికిత్స అందుతోందని.. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పినట్లు చిన్నారి మేనమామ సన్యాసిరావు తెలిపారు. రూ.3.14లక్షల ఆస్పత్రి ఖర్చులు చెల్లించి కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారన్నారు. అప్పులు చేసి ఆ మొత్తం బిల్లు చెల్లించామని, బాబును కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు 108 వాహనం కూడా సిద్ధం చేశామన్నారు.

ఇంతలో వైద్యులు వచ్చి బాబు చనిపోయాడని చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యామన్నారు. డబ్బులు తీసుకుని తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చికిత్స సమయంలో ఏం జరిగిందో తమకు తెలియనివ్వలేదన్నారు. త్రీ టౌన్‌ సీఐ కోరాడ రామారావు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. న్యూమోనియా, కార్డియా క్‌ అరెస్ట్‌తో బాధపడుతున్న బాలుడిని ఆస్పత్రిలో చేర్చారని, చికిత్స అందించడంలో ఎటువంటి లోటుపాట్లు జరగలేదని ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు రాధాకృష్ణ, విశ్వతేజ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top