అల్లూరి సీతారామరాజు జిల్లా: ఆమె నిండు గర్భిణి. ప్రసవ తేదీ దాటిపోయి నాలుగురోజులవుతోంది... దీంతో ఆందోళన చెందిన వైద్య సిబ్బందివెంటనే ఆస్పత్రికి రావాలని ఆమెను కోరారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.సిబ్బంది ప్రాథేయపడినా, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినా ఆస్పత్రికి వెళ్లకుండా మొండికేసింది. వివరాలు... బూదరాళ్ల పంచాయతీ గరిమండలో మంగళవారం 104 వైద్య సిబ్బంది వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అదే పంచాయతీ గోధుమలంకకు చెందిన గర్భిణి పాంగి మౌనిక చికిత్స కోసం అక్కడకు వచ్చింది.
ఆశా వర్కర్ ఆమె వివరాలను వైద్య పర్యవేక్షకులు భూలోకకు తెలియజేసింది. ప్రసవ తేదీ దాటి నాలుగు రోజులు కావస్తోందని గుర్తించారు. దీంతో ఆమెను వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్తామని, వెంటనే బయలుదేరాలని భూలోక తోపాటు వైద్య సిబ్బంది తెలిపారు. గర్భిణి భర్త కృష్ణకు కూడా నచ్చజెప్పారు. అయితే ఆస్పత్రికి వచ్చేందుకు గర్భిణి నిరాకరించింది. బుధవారం ఆస్పత్రి వస్తానని తెలిపింది. రాజేంద్రపాలెంకు గోధుమలంక 20 కిలోమీటర్ల దూరంలో ఉందని, నొప్పులు వస్తే ఇబ్బందులు పడతారని హెచ్‌ఎస్ భూలోక, ఏఎన్‌ఎం రాజేశ్వరి, ఎంఎల్‌హెచ్‌పి జోత్స్న నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినా..అయినా ఆమె స్పందించలేదు. ఆమె నాల్గోసారి గర్భందాల్చిందని, అబార్షన్ కారణంగా మూడో కాన్పు జరగలేదని హెచ్‌ఎస్ భూలోక చెప్పారు.


