
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జెడ్పీ సీఈవో కన్నమనాయుడు
చిలకలపూడి(మచిలీపట్నం): ఈనెల 12న కృష్ణా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారును టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన ఘటనలో జిల్లా పరిషత్ అధికారులు ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. గుడివాడలో జరుగుతున్న వైఎస్సార్‌సీపీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన జెడ్పీ చైర్‌పర్సన్ కారుపై టీడీపీ గూండాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇది ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన వాహనం. ఈ ఘటన జరిగి ఐదు రోజులు కావస్తున్నా జిల్లా పరిషత్ అధికారులు ప్రభుత్వ వాహనాన్ని ధ్వంసం చేసిన వారిపై ఫిర్యాదు చేయకుండా మిన్నకుండిపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు అధికారులు లోనయ్యారని పలువురు విమర్శిస్తున్నారు.
ఈ విషయంపై జిల్లా పరిషత్ సీఈవో కె.కన్నమనాయుడును ‘సాక్షి’ వివరణ కోరగా చైర్‌పర్సన్ ఉప్పాల హారిక సూచనల మేరకు కారులో ప్రయాణిస్తున్న తమ కార్యాలయ డ్రైవర్, అటెండర్ల రాతపూర్వక స్టేట్‌మెంట్లను తీసుకుని అప్పుడు ఫిర్యాదు చేస్తామని చెప్పటం గమనార్హం. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దాడి ఘటన గురించి ఇంతవరకు జెడ్పీ సీఈవో అడగటం గాని, గాయపడిన చైర్‌పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించటం గాని జరగలేదంటే ఆయన కూటమి నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారనే విషయం అర్థమవుతోందని బాహాటంగానే విమర్శిస్తున్నారు.