గంజాయిపై సమష్టి పోరు

Police departments joint strategy on Cannabis prevention Andhra Pradesh - Sakshi

పొరుగు రాష్ట్రాలతో సమన్వయం

సీఎం ఆదేశాలతో నెలరోజుల్లో లోతైన అధ్యయనం

మొదటి విడతలో 4,500 ఎకరాలు ధ్వంసం

సిద్ధమవుతున్న ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక

రాజమహేంద్రవరంలో ఉన్నతస్థాయి భేటీ

దిశా నిర్దేశం చేసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా) :  దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న గంజాయి సాగును రాష్ట్రంలో సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు యంత్రాంగం ఉమ్మడి వ్యూహం రచిస్తోంది. సాగు దశ నుంచే దీనిని కట్టడి చేసేందుకు పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లా వేదికగా రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పోలీసు అధికారులకు ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పలు విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సుమారు మూడున్నర గంటలపాటు రాజమహేంద్రవరంలో అంతర్గత సమీక్షా సమావేశం నిర్వహించారు.

సాగు దగ్గర నుంచే గంజాయి నియంత్రణ, రవాణా కట్టడికి సరిహద్దుల్లో ఎదురవుతున్న ప్రతిబందకాలను అధిగమించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకు పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని సమష్టి పోరుకు సిద్ధంకావాలని ఆదేశించారు. ఇందుకోసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేస్తున్నామని చెప్పారు. దీనికి పోలీసు, రెవెన్యూ, అటవీ, వ్యవసాయ, ఐటీడీఏల సహకారం తీసుకుంటామన్నారు. అనంతరం డీజీపీ సమావేశం వివరాలను మీడియాకు  వివరించారు. 

మీరే చూస్తారుగా..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నెలరోజులుగా రాష్ట్రంలో గంజాయిపై లోతైన అధ్యయనం చేశామని గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. రానున్న రోజుల్లో గంజాయిని ఎలా అరికడతామో మీరే చూస్తారుగా అని డీజీపీ అన్నారు. నిజానికి ఆంధ్రా–ఒడిశా మధ్య గంజాయి సమస్య దశాబ్దాలుగా ఉందన్నారు. ఎన్‌ఐఎ సహకారంతో ఇప్పుడు దానిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో 2.90 లక్షల కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని డీజీపీ చెప్పారు. పదేళ్ల కంటే గత ఏడాదిలో కొన్ని రెట్లు అధికంగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గతంలో 3 వేల ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు చెబుతున్నారని.. కానీ, ఈసారి మొదటి విడతలోనే 4,500 ఎకరాల్లో ధ్వంసం చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని ఆయన చెప్పారు.
మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్‌ 

ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులపై గట్టి నిఘా ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వారందరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు. ఇప్పటికే  463 మంది అంతర్రాష్ట్ర నిందితులను దోషులుగా నిలబెట్టామన్నారు. అలాగే, 1,500 వాహనాలను జప్తుచేసి, 5,000 మంది నిందితులను అరెస్టు చేశామని గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నామని, ఒడిశా డీజీపీతో కూడా మాట్లాడామన్నారు. ఈ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

గంజాయి సాగుపై దాడులు విస్తృతం
పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గంజాయి రవాణా, సాగుపై పోలీసు దాడులు నిర్వహించామన్నారు. ఈ ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్‌ బృందాలను నియమించామన్నారు. నిజానికి.. 2016లోనే ఏపీతో పాటు ఒడిశా సైతం గంజాయికి కేంద్రంగా మారిందన్నారు. ఇక గంజాయి ఏ విధంగా తరలిస్తున్నారు? ఎలా పట్టుకోవాలి? ఎక్కడ చెక్‌ పోస్టులు పెట్టాలి అనే అంశాలపై సమగ్రంగా చర్చించామని డీజీపీ చెప్పారు. నాలుగేళ్లుగా కేరళ నుంచి వచ్చిన స్మగ్లర్లు ఇక్కడే ఉండి గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తించామని ఆయన చెప్పారు. గంజాయి స్మగ్లింగ్‌ ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎక్కువగా ఉందన్నారు. 

అసత్య ఆరోపణలు సరికాదు
ఇక గుజరాత్‌ ముంద్రా, నరసాపురం ఉదంతాలతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మరోసారి స్పష్టంచేశారు. కొందరు కావాలనే దీనిపై అసత్యపు ప్రచారం చేస్తున్నారన్నారు. విచారణ చేస్తున్న ఏజెన్సీలన్నీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, ఇప్పుడు సీబీఐ కూడా ఆరా తీస్తున్నాయని ఆయన చెప్పారు. పోలీస్‌ వ్యవస్థపై రాజకీయంగా విమర్శలు చేయవద్దని డీజీపీ హితవు పలికారు. గంజాయి, ఇతర స్మగ్లింగ్‌ వ్యవహారాలపై ప్రజలు ముందుకొచ్చి సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు. ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 

ఏపీ, తమిళనాడు పోలీసులు సహకారం
శ్రీసిటీ వేదికగా ఇరు రాష్ట్రాల పోలీసు అధికారుల చర్చలు
ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో అక్రమ రవాణా, శాంతిభద్రతల పరిరక్షణకు కసరత్తు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) అడిషనల్‌ ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీసు శాఖల సమన్వయం, పరస్పర సహకారం కోసం మంగళ వారం శ్రీసిటీ పారిశ్రామికవాడలోని వ్యా పార వాణిజ్య కేంద్రంలో చిత్తూరు, నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలకు చెందిన పలువురు పోలీసు అధికారులు సమావేశమయ్యారు. సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన శ్రీసిటీ సెజ్‌ పరిధిలో ఇరు ప్రాంతాల పోలీసుల మధ్య సహకారం, సమన్వయం ఉన్నప్పుడే అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ చర్యలతో శ్రీసిటీని శాంతిభద్రతల విషయంలో మోడల్‌ సిటీగా మార్చవచ్చన్నారు. అలాగే, ఆకతాయిలు, రౌడీమూకలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అంతర్రాష్ట్ర నేరాలను నివారించడం, ఇసుక, కంకర, మట్టి, ఎర్రచందనం, మద్యం, గంజాయి, రేషన్‌ బియ్యంలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. శ్రీసిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (కస్టమర్‌ రిలేషన్స్‌) రమేష్‌కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్‌ రమేష్‌ సాదర స్వాగతం పలికారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top