సీలేరు శిఖరానికి మరో వెలుగు కిరీటం

Plans To Increase The Capacity Of The Power Plant - Sakshi

విద్యుదుత్పత్తి కేంద్రం సామర్థ్యం పెంపునకు ప్రణాళిక

మరో రెండు యూనిట్ల నిర్మాణానికి చర్యలు 

త్వరలో 1075 మెగావాట్ల ఉత్పత్తి

రూ.510 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

తూర్పు కనుమల్లో ఊపిరి పోసుకుని.. కొండాకోనల్లో పరవళ్లు తొక్కుతూ.. పచ్చని అడవుల్ని పలకరిస్తున్న అపార జలవాహిని వెదజల్లే విద్యుత్‌ కాంతుల కేంద్రం సీలేరు. ఇంధన వనరుల్లో అత్యంత చౌకగా లభించే జలవిద్యుత్‌ కేంద్రంగా ఇది పేరుగాంచింది. మరిన్ని వెలుగులు పంచేలా మరో రెండు యూనిట్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఆగస్టు 19న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. రూ.510 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. 

సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయగా సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. డొంకరాయిలో ఒక యూనిట్‌ 25 మెగావాట్లు, మోతుగూడెంలో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. అదే ప్రదేశంలో మరో రెండు యూనిట్లు నిర్మించి అదనంగా 230 మెగావాట్ల విద్యుదుత్పత్తిని అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 

యూనిట్ల నిర్మాణం ఇలా.. 
మోతుగూడెం (పొల్లూరు) జల విద్యుత్‌ కేంద్రం నుంచి మరో 230 మెగావాట్ల విత్యుదుత్పత్తికి జెన్‌కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పొల్లూరులో నాలుగు యూనిట్ల ద్వారా 460 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోంది. మరో రెండు యూనిట్లు పూర్తయితే 230 యూనిట్ల విద్యుదుత్పత్తిని గ్రిడ్‌కు అందించవచ్చనే ఉద్దేశంతో 1975లో పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రం మొదటి దశలో నాలుగు యూనిట్ల నిర్మాణం జరిగింది. భవిష్యత్తులో రెండు యూనిట్లు నిర్మించేందుకు వీలుగా పెన్‌స్టాక్‌లు అమర్చడంతోపాటు జనరేటర్‌ ఏర్పాటుకు ఖాళీ ప్రదేశాన్ని కూడా అప్పటి నిపుణులు డిజైన్‌ చేసి ఉంచారు. అప్పటి ఇంజనీర్ల సమయస్ఫూర్తితో మరో రెండు యూనిట్ల నిర్మాణానికి అవకాశం ఉండేలా చేయడంతో అదనపు విద్యుదుత్పత్తికి అవకాశం ఏర్పడింది. రెండో దశ నిర్మాణం పూర్తయితే రబీలో విద్యుదుత్పత్తి చేసి అనంతరం నీటిని గోదావరికి విడుదల చేయవచ్చని, డొంకరాయి నుంచి వృథా కాకుండా చేయొచ్చని అధికారుల అంచనా. 

గాలికొదిలేసిన గత ప్రభుత్వాలు 
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సులో విద్యుదుత్పత్తిని పెంచేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు గాలికొదిలేశాయి. దీంతో ఏటా గోదావరి డెల్టా పంట భూములకు 40 టీఎంసీల వరకు నీటిని విద్యుదుత్పత్తి చేయకుండా నేరుగా గోదావరిలోకి వదలాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కొత్త యూనిట్ల అంశానికి కదలిక వచ్చింది. సీలేరు కాంప్లెక్సులో పొల్లూరు వద్ద రెండు యూనిట్లను నిర్మించి 230 మెగావాట్ల విద్యుదుత్పత్తిని పెంచుతూ గోదావరిలోకి వృథాగా నీరు వెళ్లకుండా చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఇందుకోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.510 కోట్లను కేటాయించారు. ఈ పనులకు డిసెంబర్‌లో టెండర్లు వేసేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఈ పనులు ప్రారంభమైతే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

దేశంలోనే గుర్తింపు 
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సు ప్రతి ఏటా లక్ష్యానికి మించి విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుని దేశంలో గుర్తింపు తెచ్చుకుంది. ఇలాంటి విద్యుత్‌ కేంద్రంలో మరో రెండు యూనిట్ల నిర్మాణం చేపట్టడం చాలా ఆనందించాల్సిన విషయం.
 – గౌరీపతి, చీఫ్‌ ఇంజనీర్, మోతుగూడెం 

యూనిట్ల నిర్మాణంతో ఉపాధి 
సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సులో మరో రెండు యూనిట్ల నిర్మాణంతో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు వరంగా మారనుంది. రెండు యూనిట్ల నిర్మాణంతో వలస వెళ్లకుండా గ్రామంలోనే పనులు చేసుకోవచ్చు. 
– ఆదినారాయణ, పొల్లూరు గ్రామం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top