బంద్‌కు ప్రభుత్వ మద్దతు

Perni Nani Says Government Support To Bandh Over Vizag Steel Plant Privatisation - Sakshi

కార్మికులతో కలిసి నడుస్తాం: మంత్రి పేర్ని నాని 

సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్న కేంద్ర నిర్ణయంపై వెల్లువెత్తుతున్న ప్రజా ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ బాసటగా నిలుస్తుందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. కార్మిక సంఘాలు శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ ప్రభుత్వం సంఘీభావం తెలుపుతోందన్నారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జనవాణిని కేంద్రానికి వినిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తోందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మొదట్నుంచీ వ్యతిరేకిస్తోందన్నారు. నేలకొరిగిన తెలుగువారి త్యాగాల ఫలితమే విశాఖ ఉక్కు అన్న నిజాన్ని కేంద్రం ముందు నిక్కచ్చిగా చెబుతామన్నారు. కోట్లాది మంది ప్రజల మనోభీష్టానికి సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని చెప్పారు. కదం తొక్కుతున్న ప్రజాస్ఫూర్తిని నాని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఇంకేమన్నారంటే... ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా బంద్‌ చేపట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం తర్వాత తిరిగేలా ఏర్పాట్లు చేశాం.

ప్రజా వ్యతిరేకతను గుర్తించి ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం డిమాండ్‌ చేస్తోంది. విశాఖ ఉక్కును లాభాల్లోకి తేవచ్చని, నష్టాల నుంచి గట్టెక్కించే మార్గాలను సీఎం సూచించారు.  ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన సీఎం జగన్‌ కృషి అందరికీ ఆదర్శం.  రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేస్తుంటే విపక్షం గగ్గోలు పెట్టడం అర్థరహితం.  ప్రజలపై పన్నుల భారం మోపే ఆలోచన సీఎంకు లేదు.  

చదవండి:  'ఉక్కు' పిడికిలి బిగిసింది

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top