మిరియం సాగులో కేరళకు పోటీ 

Pepper Cultivation is also grown in Visakha and becoming Competition to Kerala - Sakshi

దిగుబడి, నాణ్యతలో విశాఖ మన్యం దూకుడు

కాఫీ తోటల్లో అంతర పంటగా సాగు 

ఈ ఏడాది 4 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి 

1.04 లక్షల మంది గిరిజన రైతులకు రూ.150 కోట్ల వరకు ఆదాయం 

పాడేరు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహం 

సాక్షి, విశాఖపట్నం: మిరియాల సాగుకు కేరళ పెట్టింది పేరు. ఇప్పుడు విశాఖ మన్యంలోనూ మిరియాలు సాగవుతున్నాయి. దిగుబడిలోనే కాకుండా నాణ్యతలోనూ మన్యం మిరియం కేరళకు గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో పండే మిరియాల కంటే నాణ్యమైన ఆర్గానిక్‌ మిరియాలను విశాఖ మన్యం అందిస్తోంది. ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండానే.. ఇంకా చెప్పాలంటే పైసా పెట్టుబడి లేకుండానే గిరిజన రైతులు వీటిని పండిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మిరియాల పంట ద్వారానే మన్యం రైతులు రూ.150 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించారంటే విశేషమే మరి. విశాఖ మన్యంలో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు జరుగుతోంది. కాఫీ తోటల ద్వారా కాపును బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం వస్తుంటే.. అందులో అంతర పంటగా వేస్తున్న మిరియాలతో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతోంది.  

98 వేల ఎకరాల్లో అంతర పంటగా.. 
మిరియాల సాగుకు సూర్యరశ్మితో పాటు తగిన నీడ కూడా ఉండాలి. నీరు నిలవని ఏటవాలు భూమి అవసరం. పాదులు 20 నుంచి 30 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి కాబట్టి వాటికి ఆసరాగా ఎత్తయిన చెట్లు ఉండాలి. విశాఖ మన్యంలోని కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం 98 వేల ఎకరాల కాఫీ తోటల్లో రైతులు అంతర పంటగా మిరియాల పాదులు వేశారు. ఒకసారి మొక్క వేస్తే రెండో ఏట నుంచే కాపు మొదలవుతుంది. 20 సంవత్సరాల పాటు జనవరి నుంచి ఏప్రిల్‌–మే నెల వరకూ ఫలసాయం వస్తుంది. ఈ ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం పొడవుగా ఎదిగే సిల్వర్‌ ఓక్‌ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల మొదలులో మిరియం మొక్కలు నాటుతున్నారు. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో.. 
పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజన రైతులను మిరియాల సాగు వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు–1 అనే రకాల మిరియాలు సాగవుతున్నాయి. వాటికన్నా అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చే మేలు రకాల మొక్కల (మదర్‌ ప్లాంట్ల)ను కోజికోడ్‌లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పైసెస్‌ రీసెర్చ్‌–ఐఐఎస్‌ఆర్‌) నుంచి తీసుకొచ్చి చింతపల్లిలో నర్సరీల్లో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో శక్తి, మలబార్‌ ఎక్సెల్, పౌర్ణమి, గిరిముండ, పంచమి, శుభకర, శ్రీకర రకాల మొక్కలు ఉన్నాయి. 

రికార్డు స్థాయిలో దిగుబడి 
వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల మెట్రిక్‌ టన్నుల మిరియాల దిగుబడి వచి్చంది. 3.2 కిలోల పచ్చి మిరియాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. వాటి ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150 కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరియాలతో సమకూరింది.

లాభసాటి మొక్కల అభివృద్ధి 
కేరళ నుంచి లాభసాటి రకాల మిరియం మొక్కలను తెచ్చి నర్సరీల్లో అంట్లు కట్టడం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే జీకే వీధి, చింతపల్లి, పాడేరు మండలాల్లో రైతులకు మొక్కలు ఉచితంగా పంపిణీ ప్రారంభించాం. రానున్న రోజుల్లో మిగతా మండలాల్లోనూ అందిస్తాం. ఎకరాకు వంద మొక్కలు చొప్పున అవసరమవుతున్నాయి. 
– రాధాకృష్ణ, ఉద్యాన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ 

రైతులకు సహకారం 
ఎరువులు, సస్యరక్షణ ఖర్చు లేకపోయినా మిరియాల కోత రైతులకు కాస్త కష్టమైన పని. ఇందుకు వెదురుతో చేసిన నిచ్చెనలు వాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పైస్‌ బోర్డు అభివృద్ధి చేసిన అల్యూమినియం నిచ్చెనలను ఉచితంగా సమకూరుస్తున్నాం. క్లీనింగ్, గ్రేడింగ్‌ మెషిన్లను ఇస్తున్నాం. ఇప్పటివరకూ 20 వేల మంది రైతులకు బృందాల వారీగా సమకూర్చాం. 
– డాక్టర్‌ వెంకటేశ్వర్‌ సలిజామల, ప్రాజెక్టు అధికారి, పాడేరు ఐటీడీఏ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top